తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి.ఇవాళ త్రయోదశి శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. వరుసగా సెలవులు రావడంతో దర్శనానికి భక్తులు బారులు తీరారు. త్రయోదశి సందర్భంగా ప్రముఖులు శ్రీవారి దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్జ్ నాగరత్నం, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్జ్ కే సురేష్‌రెడ్డి, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత శ్రీవారిని దర్శించుకున్నారు.
మరోవైపు తిరుపతిలో కేటాయిస్తున్న ఉచిత వైకుంఠ ద్వార దర్శన టికెట్లు పూర్తి అయ్యాయి. మూడ్రోజుల వ్యవధిలోనే టీటీడీ 4,23,500 టికెట్లు జారీ చేసింది. ఈ నెల 21 రాత్రి నుంచే తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా టోకెన్ల జారీని ప్రారంభించారు. మొదటి రెండు రోజులు భారీగా భక్తులు దర్శన టికెట్ల కోసం క్యూలైన్లలో బారులుతీరారు. ఈనెల 22 రాత్రి 11:30 నుంచి టోకెన్లు జారీ చేసిన టీటీడీ 4.25 లక్షల భక్తులకు వైకుంఠద్వార దర్శన టోకెన్లు జారీ చేసింది. టైమ్ స్లాట్, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. రోజూ 65 వేల మందికి పైగా భక్తులకు వైకుంఠద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఈనెల 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార భక్తులు దర్శనం చేసుకోవచ్చు.
తిరుమల శ్రీవారి దర్శనానికి దూర ప్రాంతం నుంచి వచ్చినవారు శని, ఆదివారాల్లో జారీ చేసిన టోకెన్లలో వారం తర్వాత దర్శన తేదీలు ఉండటం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రోజులు ఇక్కడ వేచి ఉండలేని పరిస్థితి.. కొందరు టోకెన్లు పొందినా వెనుదిరిగే అవకాశం లేకపోలేద. రద్దీని బట్టి ఏరోజుకారోజు దర్శనం చేసుకొనేందుకు పరిమిత సంఖ్యలోనైనా టోకెన్లు ఇవ్వాలని భక్తులు విన్నవిస్తున్నారు. దూరప్రాంత వాసులు, అయ్యప్ప భక్తులు, గోవిందమాల భక్తుల కష్టాలను గుర్తించి టీటీడీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రద్దీ నియంత్రణకు టీటీడీ తీసుకొచ్చిన టైమ్‌స్లాట్ టోకెన్ల విధానంతో తిరుమలలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కావడం లేదు. క్యూ కంపార్ట్‌మెంట్లను రెండు మూడు గంటల్లోనే ఖాళీచేసి దర్శనాలకు పంపుతున్నారు. అంతేకాదు వీఐపీ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖల్ని కూడా స్వీకరించడం లేదు.. అంతేకాదు కేవలం దర్శనం టికెట్లు ఉన్నవారే తిరుమలకు రావాలని టీటీడీ సూచిస్తోంది. టికెట్ లేనివారు కూడా రావొచ్చని.. కాకపోతే దర్శనం చేసుకునే అవకాశం ఉండదన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ చెబుతోంది.