2024 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం బోలెడెన్ని మార్పులను తీసుకురానుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో 2024లో చాలా మార్పులు రాబోతున్నాయి. మార్చి-ఏప్రిల్ నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటమే దీనికి కారణం. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్ల పాలనకు ప్రజలు మార్కులేసే సమయం వచ్చింది. గత ఎన్నికల్లో 23 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ.. ఈసారి గెలిచి తీరాలనే కసితో ఉంది. అందుకే జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతోంది.
ఎన్నికలకు ఇంకా 3-4 నెలల సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీలు ఈసారి మునుపెన్నడూ లేని రీతిలో అస్త్రశస్త్రాలను వెలికి తీస్తున్నాయి. కొత్త పార్టీలు, సరికొత్త వ్యూహాలతో 2024 అసెంబ్లీ ఎన్నికలు ఏపీ చరిత్రలో నిలిచిపోయేలా ఉండనున్నాయంటే అతిశయోక్తి కాబోదు. ఇప్పటి వరకూ చూస్తే.. ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ద్విముఖ పోరే ఉండనుంది. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే ఆశతో ఉన్న జగన్ పార్టీ ఓవైపు ఉంటే.. టీడీపీ, జనసేన కూటమి మరోవైపు నిలబడుతోంది. బీజేపీ సైతం తమ కూటమిలో చేరాలని ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నప్పటికీ.. అటు నుంచి మాత్రం ఇంకా స్పందన లేదు.
వచ్చే కొద్ది రోజుల్లో ఏపీలో పొలిటికల్ సీన్ మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడం అంటే.. మన ఓట్లు మనం పొందడమే కాదు.. ప్రత్యర్థి ఓట్లు చీల్చాలనే వ్యూహాన్ని కూడా పార్టీలు 2024లో ఎక్కువగా అమలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఆంధ్రాలో కొత్త పార్టీలు పుట్టుకురావడం, కనుమరుగయ్యాయని భావిస్తున్న పార్టీలు మళ్లీ బలం పుంజుకునే ప్రయత్నాలు చేస్తుండటాన్ని ఇందులో భాగంగా చూడొచ్చు. సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీ నారాయణ ‘జై భారత్ (నేషనల్)’ పేరిట కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా తేవడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. బలిజ (కాపు) సామాజికవర్గానికి చెందిన లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా కాపుల ఓట్లు చీలుతాయనే అభిప్రాయం ఉంది.
ఇక జాతీయ జనసేన పేరుతో ఏర్పాటైన మరోపార్టీ సైతం ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి నిలిచేందుకు సై అంటోంది. ఆ పార్టీ గుర్తు బకెట్. ఇది జనసేన గ్లాస్ సింబల్‌కు దగ్గరగా ఉంది. అంతేకాదు జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడి పేరు కె. పవన్ కళ్యాణ్. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అయితే జాతీయ జనసేన అధ్యక్షుడు కొనింటి పవన్ కళ్యాణ్ అంట. పార్టీ పేరు, అధినేత పేరు దాదాపుగా సేమ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో పోటీ చేసి 762 ఓట్లు పొందిన ఈ కొత్త పార్టీ వల్ల ఎవరికి నష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని.. ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగ్గిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెతో ఇప్పటికే చాలా మంది నేతలు, ముఖ్యంగా వైఎస్సార్సీపీలో అసంతృప్తితో ఉన్న, టికెట్ల దక్కని నేతలు టచ్‌లో ఉన్నారని.. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే వారు కూడా ఆమె వెంట హస్తం పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్సీపీ ఓటు బ్యాంక్ దాదాపు గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే. దీంతో కాంగ్రెస్ పార్టీ బలపడితే దాని ప్రభావం నేరుగా జగన్ పార్టీపై పడుతుంది. తెలంగాణలో ఉన్న నేతల ఆస్తులు, వ్యాపారాలకు సహకరిస్తామనే హామీతో కాంగ్రెస్ నేతలు గతంలో తమ పార్టీలో పని చేసి ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్న నేతలను తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట.
టీడీపీ విషయానికి వస్తే.. గతంలో ప్రశాంత్ కిషోర్‌ను బిహార్ బందిపోటుగా అభివర్ణించిన చంద్రబాబు నాయుడు ఇటీవల ఆయన్ను ఇంటికి పిలిపించుకొని మరీ మాట్లాడారు. వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ భేటీ సారమేంటనేది ఎవరూ బయటకు చెప్పనప్పటికీ.. 2024లో టీడీపీ గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదని మాత్రం దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇక బీజేపీతోపాటు సీపీఐ, సీపీఎం, ప్రజాశాంతి పార్టీ.. ఇలా అనేక పార్టీలు సైతం ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నాయి. అంటే పోటీ బహుముఖం కానుంది. దీని వల్ల ఓట్లు చీలిపోతాయి. ఇది ఎవరికి కలిసొస్తుందో వారే అధికారంలోకి వస్తారు. అందుకే పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే.. ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.