తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు పూర్తి కావడంతో.. తదుపరి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ తేదీ నుంచి జారీ చేస్తారని టీటీడీ తెలిపింది. డిసెంబర్ 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్లను జారీ సోమవారం ఉదయం 4.27 గంటలకు పూర్తయ్యాయని తెలిపారు. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్‌పి హైస్కూల్‌లో 90 కౌంటర్లలో 10 రోజులకు గాను 4 లక్షలకుపైగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను సోమవారం ఉదయానికి జారీ చేయడం పూర్తయింది. టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరని.. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 26వ తేదీన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది.
తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారు దర్శనం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం రాత్రి శ్రీ కామాక్షి అమ్మవారు దర్శనమిచ్చారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ కామాక్షి, లక్ష్మీ, సరస్వతి అమ్మవారు కపిలతీర్థం పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
త్యాగరాజ సంగీత మహోత్సవాలకు ఆహ్వానం
తిరుపతి వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న శ్రీసద్గురు త్యాగరాజ స్వామివారి సంగీత మహోత్సవాలకు తరలిరావాలని సంఘం అధ్యక్షుడు రుద్రకోటి సదాశివం కోరారు. సోమవారం స్థానిక ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ ఉమా ముద్దుబాలకు ఆహ్వాన పత్రికను అందించి ఆహ్వానించారు. జనవరి 6, 7న సంగీత మహోత్సవం ఉంటుందని, రామచంద్ర పుష్కరణిలో అంతర్జాతీయ కచేరి జరుగుతుందని వివరించారు. ముఖ్య అతిథులుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. సంఘం గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ, ఈశ్వరమ్మ, ఎస్.మునిరత్నం, ఆర్.కృష్ణారావు, లక్ష్మీ సువర్ణ, రామచంద్రయ్య, నటరాజ తదితరులు పాల్గొన్నారు.