ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. సీఎం జగన్ బ్యాడ్మింటిన్ ప్లేయర్ కిందాంబి శ్రీకాంత్ కలిసి క్రీడా జ్యోతిని వెలిగించారు. సీహెచ్ రమాదేవికి క్రీడల టార్చ్‌ను సీఎం జగన్‌కు అందజేశారు. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆటల పోటీలు మొదలయ్యాయి. 47 రోజుల పాటూ ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడలకు సంబంధించి కిట్లను సీఎం జగన్ ఆటగాళ్లకు అందజేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.09లక్షల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ చేశారు. 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సరదాగా ముఖ్యమంత్రి క్రికెట్ ఆడి సందడి చేశారు.
క్రీడలకు స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ చాలా అవసరమని సీఎం జగన్ అన్నారు. ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ 2023లో క్రీడలకు సంబంధించి సీఎం జగన్, క్రీడాకారులతో ప్రమాణం చేయించారు. ఈ క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే మైలురాయి అన్నారు ముఖ్యమంత్రి . అందరూ పాల్గొనే ఓ గొప్ప పండుగ.. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వ్యాయామం వల్ల బీపీ, డయాబెటిక్ వంటివి అదుపులో ఉంటాయన్నారు. గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసరమని.. అందుకే గ్రామస్థాయి నుంచి అడుగులు వేస్తున్నామన్నారు. గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి దేశానికి అందిస్తామని.. గ్రామస్థాయి క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 15004 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. 9వేల ప్లే గ్రౌండ్స్‌ను ఏర్పాటు చేశామని.. 47 రోజులు, ఐదు దశల్లో పోటీల నిర్వహణ ఉంటుందన్నారు. క్రీడా సంబరాలు ఇకపై ప్రతీ ఏడాది జరుగుతాయని.. రూ.12కోట్లకుపైగా నగదు బహుమతులు అందిస్తామన్నారు. దేశంలోనే అతి పెద్ద మెగా టోర్నీని నిర్వహిస్తుమన్నారు సీఎం. ప్రతి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభుత్వం నియమించింది. .33 లక్షల జట్లు పోటీ పడేందుకు అనువుగా 9,478 క్రీడా మైదానాలను తీర్చిదిద్దారు.
డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వతేదీ వరకు 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలి దశలో జనవరి 9వతేదీ నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వతేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్ కోచ్‌లు, క్రీడా సంఘాలను పోటీలు సమర్థంగా నిర్వహించేలా సమాయత్తం చేశారు. ఇప్పటికే రిఫరీలుగా 1.50 లక్షల మంది వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. క్రీడాకారుల మొబైల్ ఫోన్లకు మ్యాచ్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించనున్నారు.
నియోజకవర్గ స్థాయిలో ఐదు రకాల క్రీడాంశాల్లో ప్రొఫెషనల్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బ్యాడ్మింటన్‌లో సింధు, శ్రీకాంత్ బృందాలు, వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్, కబడ్డీలో ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు, ఖోఖోలో రాష్ట్ర క్రీడా సంఘ ప్రతినిధులు టాలెంట్ హంట్ చేయనున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతరం వారికి వివిధ స్థాయిలో అంతర్జాతీయ శిక్షణ అందించడం, ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మకం ఈవెంట్‌లో అవకాశం కల్పించే దృక్పథంతో పోటీలను నిర్వహిస్తోంది.