సంక్రాంతి పండుగకు మరో మూడు వారాల సమయం ఉంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా ఏపీకి జనాలు క్యూ కడతారు. అయితే ఈసారి కూడా సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలంటే జేబు ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలను భారీగా పెంచారు. ఇప్పటికే రైళ్లు నిండిపోవడంతో పాటుగా ఆర్టీసీ బస్సు సర్వీసులపై క్లారిటీ రాకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ ధరలు అమాంతం పెంచేశాయి. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడ రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వైపు.. ఇటు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతివైపు వెళ్లే ప్రయాణికుల సంఖ్య వేలల్లో ఉంటుంది. సంక్రాంతి కోసం జనవరి 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు బయలుదేరతారు. ఆయా తేదీల్లో ప్రైవేటు బస్సుల ఛార్జీలను భారీగా పెంచేశారు. చాలా సర్వీసుల్లో రూ.1000 - 2000 మధ్యలో పెరిగిన టికెట్ ధరలను చూసి ప్రయాణికులు అవాక్కవుతున్నారు.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రైవేటు ట్రావెల్స్‌లో వెళ్లి రావాలంటే రూ.ఐదారు వేలకుపైగా ఖర్చు ఖాయంగా కనిపిస్తోంది. చిత్తూరు, కడప, విజయవాడలకు వెళ్లే బస్సుల్లో సైతం సాధారణ ఛార్జీల కంటే రూ.500-1200 వరకు అదనంగా ఛార్జీలు పెంచారు. ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్ టికెట్ ధర రూ.1,500-2,000 వరకు ఉండగా.. పండగ సమయంలో భారీగా పెరుగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఇక బెంగళూరు, చెన్నై నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
పండగ రోజుల్లో రద్దీ ఉంటుందని భావించిన రైల్వేశాఖ ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఇటీవల 20 ప్రత్యేక రైళ్లను కేటాయించినప్పటికీ అవి కూడా సరిపోతాయా లేదా అన్నది చూడాలి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నిత్యం తిరిగే ఈస్ట్‌కోస్ట్, కోణార్క్, ఫలక్‌నుమా, విశాఖ, గోదావరి, గరీబ్‌రథ్, నాందేడ్-విశాఖ రైళ్లతోపాటు వీక్లీ రైళ్ల టికెట్లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉండగా.. మరికొన్ని రైళ్లలో రిగ్రెట్ వస్తోంది. బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే రెగ్యులర్ రైళ్లు కాకుండా ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
దీంతో జనాలు ప్రైవేటు ట్రావెల్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. హైదరాబాద్ నుంచి బయలుదేరే తెలంగాణ, ఆంధ్రా ఆర్టీసీ రెగ్యులర్ బస్సుల్లో ఇప్పటికే టికెట్లన్నీ అయిపోయాయి. ఏపీఎస్‌ఆర్టీసీ 600 నుంచి 800 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకం మొదలైన కొన్ని గంటల్లోనే ఈ బస్సులూ ఫుల్ అయిపోయాయి. టీఎస్‌ఆర్టీసీ బస్సుల పరిస్థితీ ఇలాగేఉంది. విమాన టికెట్ల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఈసారి కూడా సంక్రాంతితకి సొంతూరు వెళ్లాలంటే జేబులు ఖాళీ కావం ఖాయం అంటున్నారు.