జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 27న కాకినాడ వెళుతున్నారు. 28, 29, 30 తేదీల్లో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ఇక్కడే బసచేసి.. ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు, ఇతర కీలక నేతలు, కార్యకర్తలతో మాట్లాడతారు. టీడీపీ-జనసేన పొత్తు, నేతల్ని సమన్వయపరచడంతోపాటు.. జిల్లాల్లో పోటీకి అనుకూలమైన నియోజకవర్గాల గురించి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల పవన్ పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పర్యటన షెడ్యూలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
జనసేన పార్టీ ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. టీడీపీతో పొత్తులో భాగంగా ఈ జిల్లాల నుంచి ఎక్కువ టికెట్లు అడిగే అవకాశం ఉందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రను తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు జనసేనాని ఈ రెండు జిల్లాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారనే చర్చ ఉంది. 2019 ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరంలో పోటీచేసి ఓడిపోయారు. మరి ఈసారి ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈసారి కూడా రెండు చోట్ల పోటీ చేస్తారా.. ఒక్క నియోజకవర్గానికి పరిమితం అవుతారా అన్నది చూడాలి. పవన్ మళ్లీ గాజువాక నుంచి పోటీ చేస్తారనే టాక్ ఉంది. అలాగే కాకినాడ రూరల్, అర్బన్.. పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అంతేకాదు తిరుపతి నుంచి పోటీ చేస్తే బావుంటుందనే ప్రపోజల్ కూడా వచ్చింది.. కానీ జనసేనాని మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే టీడీపీ, జనసేనలు వీలైనంత త్వరగా సీట్ల వ్యవహారం తేల్చేయాలని భావిస్తున్నారు. సంక్రాంతి నాటికి అభ్యర్థుల్ని ఫైనల్ చేసుకుని.. మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ స్థానిక నేతలతో చర్చించి.. ఏ, ఏ స్థానాల్లో పోటీచేస్తే బావుంటుందనే అభిప్రాయాలు సేకరించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు టీడీపీతో సమన్వయానికి సంబంధించిన అంశాలపైనా పవన్ కళ్యాణ్ జనసైనికులతో చర్చించనున్నారు. ముందుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వెళుతున్నారు.. ఆ తర్వాత పశ్చిమ గోదావరి, విశాఖకు వెళతారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ కార్యాలయానికి పలువురు నేతల్ని పిలిచి మాట్లాడిన సంగతి తెలిసిందే.