హమాస్‌కు మద్దతుగా దాడులకు తెగబడుతున్న యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదుల దృష్టి సముద్రగర్భంలోని అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్‌పై పడింది.ఇజ్రాయెల్, అమెరికా.. వాటి అనుకూల దేశాల్ని దెబ్బతీసే విధంగా ఎర్రసముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్‌ను కత్తిరించి వేస్తామని తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఇందుకోసం బాబ్ అల్-మందాబ్ జలసంధి మీదుగా సముద్రగర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరించి వేస్తామని బెదిరింపులకు దిగారు. అదే గనుక జరిగితే ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయంటూ సోషల్‌మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.
యెమెన్‌లోని తిరుగుబాటు దళాలే 'హౌతీ'లు. ఆ దేశ ఉత్తరభాగంలో వీరి ప్రాబల్యం ఎక్కువ. వీళ్లకి ఇరాన్ నుంచి ఆర్థికంగా, సైనికపరంగా మద్దతు అందుతున్నది. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకలను టార్గెట్ చేశామని ఇప్పటికే ప్రకటించారు. డ్రోన్లు, క్షిపణులతో నౌకలపై దాడులు చేస్తున్నారు. దీంతో ఎర్రసముద్రంలో నౌకా వాణిజ్యం ప్రమాదంలో పడింది.