175 చోట్ల అభ్యర్థులను నిలపలేని దౌర్భాగ్యస్థితిలో చంద్రబాబు ఉన్నాడని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పవన్ కల్యాణ్‌తో జతకలిసినా కూడా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రం సంగతి దేవుడెరుగు.. కనీసం కుప్పం నియోజకవర్గానైనా కాపాడుకోవాలనే తాపత్రయంలో చంద్రబాబు ఉన్నాడన్నారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే 2024 ఎన్నికల్లో ఓడిపోతే తల ఎత్తుకోలేమనే భయంతో చంద్రబాబు కుప్పానికి వెళ్తున్నాడన్నారు. 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఆ కుప్పం నియోజకవర్గానికి కనీసం తాగునీరు అందించలేదన్నారు. సీఎం వైయస్ జగన్ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నారని మంత్రి ఆర్కే రోజా చెప్పారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌దేనని చెప్పారు. ఇప్పుడు తాగునీరు కూడా కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి తీసుకువస్తున్నారన్నారు. తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం కల్పించిన కుప్పం ప్రజలకు నీరు కూడా ఇవ్వని దౌర్భాగ్యమైన పొలిటీషియన్ చంద్రబాబు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు.