ఉత్తరాంధ్రలో బలమైన నాయకులు వంశీకృష్ణ యాదవ్‌తో 2009 నుంచి తనకు పరిచయం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం పవన్ సమక్షంలో వంశీ కృష్ణ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి యంగ్ లీడర్‌గా పని చేయడం చూశానన్నారు. మళ్లీ 2023లో ఎమ్మెల్సీగా ఉంటూ జనసేనలో చేరిన వంశీకృష్ణను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు నేడు చాలా మంది కీలక వ్యక్తులుగా మారారన్నారు. వంశీకృష్ణ తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని చెప్పడం ఆనందం కలిగించిందన్నారు. ఆయన సమస్యలను ప్రస్తావించకుండా.. భావజాలంతో వచ్చానని వంశీ చెప్పారన్నారు. వైసీపీ పాలన గురించి కాకుండా జనసేన సిద్దాంతాలను నచ్చి వచ్చానని తెలిపారన్నారు. గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా రెండుసార్లు స్వల్ప తేడాతో ఓడిపోయారన్నారు. అయినా పట్టుబట్టి ఎమ్మెల్సీగా ఆయన గెలుపొందారన్నారు. పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా.. రాష్ట్ర నాయకుడిగా వంశీ ఎదగాలన్నారు. మంచి భవిష్యత్ ఇచ్చేలా నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం ఒక క్రమంలో నడిపిన పీఎసీ ఛైర్మన్ మనోహర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు త్వరలో రాబోతున్నాయన్నారు. ఉత్తరాంధ్ర, ఎపీ అభివృద్ధి ఎంత జరిగిందో ఇప్పుడు అందరూ చూస్తున్నారన్నారు. వైసీపీలోకి వెళ్లినా ఆ పార్టీ కోసం అండగా నిలబడి పని చేశారన్నారు. ఇప్పుడు జనసేన కోసం అదే నిబద్దతతో పని చేయాలని కోరుతున్నామన్నారు. ‘‘మీరు ఎంత నమ్మకంతో పని చేస్తారో, అంతకన్నా రెట్టింపు నమ్మకం తో మేము అండగా ఉంటాం. నాకు ఏపీ అభివృద్ధి చాలా ముఖ్యం, అందులో జనసేన కీలకపాత్ర పోషించాలి. వంశీ కృష్ణ కూడా ఇందులో కీలక భూమిక వహించాలి. మనమంతా మన రాష్ట్ర అభివృద్ది, యువతరానికి మంచి భవిష్యత్తును ఇవ్వడమే లక్ష్యంగా పని చేద్దాం’’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.