ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదు కేసులు నమోదయ్యాయి.. వీటిలో విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో నమోదైనవి ఉన్నాయి. వీటితో కలిపి రాష్ట్రంలో 29 క్రియాశీలక కేసులు నమోదైనట్లు వైద్యశాఖ తెలిపింది. అయితే మరికొన్ని కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండాలనికి చెందిన ఓ వృద్ధుడు, శ్రీకాకుళానికి చెందిన మహిళకు, కొత్తూరు మండలంలో మరొకరికి పాజిటివ్ వచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో ఓ మహిళకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. కేంద్రం రిపోర్ట్ ప్రకారం సోమవారం మొత్తం 24 కేసులు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
వీరిలో కొందరు జ్వరంతోపాటు ఇతర లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది. వీరి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచారు. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు దేశంలో ఇప్పటి వరకు కరోనా కొత్త సబ్-వేరియంట్ ‘జేఎన్.1’ కేసులు 64 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6, తమిళనాడు 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సోమవారం మరో 628 కరోనా కేసులు వెలుగుచూడగా మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 4,504కు చేరింది.