విశాఖలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొమ్మాది కూడలిలో ఉదయాన్నే పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రైవేట్ బస్సు, ట్యాంకర్, మూడు కార్లు ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా కొమ్మాది కూడలిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనలో కార్లు రెండు ధ్వంసం అయ్యాయి. వారం రోజులుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పొగమంచు కురుస్తోంది. రోడ్లపై ఎదురుగా వెళ్లే వాహనాలు, వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాడేరులో అయమితే పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది.. చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి సాహసించడం లేదు. పొగమంచు కమ్మేసి ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.