తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకూ ఇకపై శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి తెలిపారు. హోమం టికెట్ కాకుండా రూ.300 అదనంగా చెల్లించిన వారికి సుపథం నుంచి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటును కల్పిస్తామన్నారు. టీటీడీ రోడ్లు, సంస్థలు ఉన్న ప్రాంతాలు, భక్తులు సంచరించే ముఖ్య ప్రాంతాల్లో మెరుగ్గా పారిశుధ్య నిర్వహణ కోసం టెండర్లను కోర్టు ఉత్తర్వులకు లోబడి కేటాయించాలని నిర్ణయించామన్నారు. హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులతో ఫిబ్రవరిలో తిరుమలలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
తిరుపతిలో పారిశుద్ధ్య పనులను హైకోర్టు ఆదేశిస్తేనే చేపడతామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. తిరుపతిలో టీటీడీకి సంబంధించిన ఆస్తులు 48 శాతం ఉన్నాయని.. వీటిపై నగరపాలికకు ఎలాంటి ఆస్తి పన్నును తాము చెల్లించడం లేదని వివరించారు. నగరంలోని ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పిలిచిన టెండర్లను న్యాయస్థానం నిబంధనల మేరకు దాఖలు చేశామన్నారు. హైకోర్టు తుది తీర్పు మేరకు ముందుకెళతామన్నారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి, శ్రీకోదండరామస్వామి సత్రాల స్థానంలో రూ.209.65 కోట్ల చొప్పున వ్యయంతో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి టెండర్లను ఆమోదించామన్నారు.
జార్ఖండ్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి వందెకరాలను కేటాయించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు భూమన. ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్ రింగ్‌రోడ్డులో గోగర్భం డ్యాం సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో పాలనా సౌలభ్యం కోసం రూ.6.15 కోట్లతో సెంట్రలైజ్డ్ రికార్డు స్టోర్ నిర్మాణానికి టెండరు ఆమోదించారు.
తిరుమలలోని హెచ్‌వీ ప్రాంతంలో మిగిలి ఉన్న కాటేజీల్లో రూ.1.82 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు టెండరు ఖరారుకు ఓకే చెప్పారు. తిరుపతిలోని శ్రీనివాసం విశ్రాంతి సముదాయంలో బస చేసే భక్తుల సౌకర్యార్థం తూర్పువైపు రూ.2 కోట్లతో ఓపెన్ డ్రైయిన్ నిర్మాణానికి నిర్ణయించారు. తిరుమలలోని యాత్రికుల కాటేజీల్లో నివాసముంటున్న పోలీసు సిబ్బందిని ఖాళీ చేయించే నిమిత్తం ప్రస్తుతమున్న పాత పోలీసు క్వార్టర్స్‌ను రూ.2.87 కోట్లతో అభివృద్ధి చేసేందుకు టెండరు ఖరారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వరాహస్వామి విశ్రాంతి భవనం వద్ద అధిక ట్రాఫిక్ దృష్య్టా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు రూ.6.32 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. చెర్లోపల్లి నుంచి శ్రీనివాసమంగాపురం వరకు ఉన్న రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరణ, వీధిదీపాలు, డ్రైయిన్లు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు రూ.17.29 కోట్లతో టెండరు ఖరారుకు ఓకే చెప్పారు. చంద్రగిరి మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ప్రాకారం, కట్‌స్టోన్ ఫ్లోరింగ్, స్టోర్ గది మండపం నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.2 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.