అనంతపురం జిల్లా గుత్తిలో దొంగలు రెచ్చిపోయారు. ఓ రైతును టార్గెట్ చేసి డబ్బులు చోరీ చేశారు. పట్టపగలే సినీఫక్కీలో బైక్ బ్యాగ్‌లో ఉన్న రూ.1.60లక్షలు ఎత్తుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న ఓ ఎరువుల షాపు దగ్గర ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మాలిళ్ల పల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతు తన కుటుంబ అవసరాల కోసం బంగారు నగలను స్థానిక కెనరా బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ. 1.60లక్షలు తీసుకున్నాడు.
అతడి బైక్ బ్యాగ్‌లో డబ్బు ఉంచుకున్నాడు. బ్యాంక్ సమీపంలో ముందుగానే రెక్కీ నిర్వహించిన గుర్తుతెలియని దుండుగులు అతడ్ని ఫాలో అయ్యారు. బస్టాండ్ సమీపంలోని ఓ ఎరువుల షాపు దగ్గర రైతు బైక్‌ను నిలపివుండగా మరో రెండు బైక్‌ల్లో వచ్చిన నలుగురు దుండగులు రైతు బైక్ వద్ద రూ. 100 పడేసి ఆ రైతుకు డబ్బులు పడిపోయాయని చెప్పి అతని దృష్టి మళ్లించారు. ఆ రైతు రూ.100 తీసుకునే క్రమంలో బైక్‌లో ఉన్న రూ. 1.60లక్షలను ఎత్తుకెళ్లారు.
పాపం బాధితుడు తిరిగి చూసేలోపు వారు అక్కడి నుంచి పారిపోయారు. రైతు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక సీఐ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అలాగే సమీపంలోని సీసీ కెమెరాలో చోరీ చేస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సీసీ ఫుటేజ్ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.