కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన కారణంగా నష్టపోయిన బాధితుల్లో ఇప్పటికీ పరిహారం అందనివారు ఎంత మంది ఉన్నారు? క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు సాయం అందని బాధితులను గుర్తించేందుకు ఎలాంటి విధానాన్ని అనుసరించాలో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్. రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోవడంలో అధికారుల వైఫల్యం ఉందని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బీజేపీ నేత ఎన్. రమేశ్ నాయుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకురాగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది ఆర్. గోపాలకృష్ణ వాదనలు వినిపించారు. మానవ తప్పిదం వల్లే ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోయిందన్నారు. బాధితుల్లో కొందరికి అరకొర పరిహారం అందజేశారని, కొన్ని గ్రామాల ప్రజలకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సి.సుమన్ స్పందిస్తూ.. బాధితులకు ఇప్పటికే పరిహారం అందజేసినట్టు తెలిపారు.