రాజమహేంద్రవరం పరిధిలో నాటుసారా, గంజాయిని నివారించి తీరాల్సిందేనని.. శాంతిభద్రతలు నియంత్రణలో ఉండాల్సిందేనని ఎస్పీ జగ దీశ్ స్పష్టం చేశారు. జిల్లా అధికారులతో జరిగిన వార్షిక నేర సమీక్ష-2023 లో ఆయన మాట్లాడుతూ..... చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాల కట్టడి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయొద్దని ఆదేశించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిర్ణీత గడువులో చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు చేయాలన్నారు. గంజాయి కేసుల్లో పెండింగ్‌లో ఉన్న అరెస్టు వారెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకోవడమే కాకుండా రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. మహిళల రక్షణకు ప్రాధాన్యమివ్వాలని, మిస్సింగ్ కేసులను వేగంగా దర్యాప్తు చేయాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. రౌడీషీటర్లపై నిఘా ఉంచాలన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ముందస్తు సమాచారం సేకరించాలని ఆదేశించారు. అసాంఘిక వ్యక్తులను, గొడవలకు కారకుల య్యేవారిని గుర్తించాలన్నారు. దర్యాప్తు చేయకుండా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు జి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఆర్ రాజశేఖర్ రాజు, ఎల్.చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.