జనవరి 1 నుంచి 14 వరకు మూడు ప్రధాన పథకాల ద్వారా అర్హులకు లబ్ధిని చేకూర్చడంతో పాటు సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబమైన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్టు విజయవాడ కలెక్టర్ ఎస్.దిల్లీరావు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కొత్త సంవత్సరంలో అమలు చేసే నాలుగు ప్రధాన కార్యక్రమాలు వైఎస్సార్ పెన్షన్ కానుక మొత్తాన్ని రూ.3 వేలకు పెంపు, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల ద్వారా చివరి విడత మొత్తం విడుదల, విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణపై ముఖ్యమంత్రి అన్నిజిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్‌చైర్మన్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణువర్థన్, వెలంపల్లి శ్రీనివాసరావు, మొండితోక జగన్మోహనరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాశ్, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, వివిధ విభాగాల అధికారులతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి వరకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన ప్రణాళికపై సీఎం జగన్మోహనరెడ్డి మార్గనిర్దేశనం చేశారని కలెక్టర్ తెలిపారు.