కృష్ణాజిల్లా పెదఅవుటపల్లిలోని సుప్రసిద్ధ కథోలికా క్షేత్రమైన తంబి పుణ్యక్షేత్రంలో దైవసేవకుడు బ్రదర్ జోస్‌ఫతంబి 79వ వర్థంతి మహోత్సవాలు(తిరునాళ్లు) జనవరి 13, 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పుణ్యక్షేత్రం రెక్టర్ రెవ.ఫాదర్ పాలడుగు జోసఫ్ అన్నారు. గురువారం కళావేదిక ప్రాంగణంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఉత్సవ ఏర్పాట్లపై గుడిపెద్దలు, సంఘపెద్దలు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన సమాలోచనలు జరిపారు. ఉత్సవాలకు దేశ, విదేశాలనుంచి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున ఆయా విభాగాల అధికారులు, సమన్వయంతో కలిసి పనిచేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పారిశుధ్యం, తాగునీరు, బందోబస్తుపై ఆయాశాఖాధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఉత్పవాలు జరిగే మూడురోజులు ఆర్టీసీ సర్వీసులు నిరంతరాయంగా నడిపేందుకు, పెదఅవుటపల్లి రైల్వేస్టేషన్లో నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలుపుదల చేసేందుకు సంబంధిత శాఖాధికారులు అనుమతి ఇచ్చారన్నారు. ఉత్సవాలు జరిగే మూడురోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు క్రైస్తవ నాటికలు ప్రదర్శించనున్నట్టు ఫాదర్ జోసఫ్ పేర్కొన్నారు. అనంతరం తంబి 79వ వర్థంతి మహోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను పుణ్యక్షేత్రం రెక్టర్ రెవ.ఫాదర్ పాలడుగు జోసఫ్, సంఘపెద్దలు, వివిధశాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. జనవరి 4నుంచి 12వరకు ఆలయప్రాంగణంలో నవదిన ప్రార్థనలు నిర్వహించనున్నట్టు జోసఫ్ తెలిపారు. కార్యక్రమంలో విచారణ గురువులు గోపు ప్రవీణ్, గోపు అభిలాష్, ఎంపీడీవో జీఎ్‌సవీ శేషగిరిరావు, ఈవోపీఆర్డీ ఎం.అమీర్‌బాషా, గ్రామసర్పంచ్ బాణావతు తిరుపతమ్మ, పంచాయతీకార్యదర్శి బి.దీప్తి, ఆత్కూరు ఏఎస్సై రామారావు, స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారులు, విద్యుత్, ఆర్టీసి, అగ్నిమాపక సిబ్బంది, గుడిపెద్దలు తదితరులు పాల్గొన్నారు.