అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరికొన్ని రోజుల్లో పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఆలయ తుది దశ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం అయోధ్యలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా అయోధ్యలో పునరుద్ధరించిన రైల్వే జంక్షన్, కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మరికొన్ని రోజుల్లో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుందని.. ఆ ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచన చేశారు. జనవరి 22 న అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని అంతా కోరుకుంటారని.. కానీ అది అందరికీ సాధ్యపడదని పేర్కొన్నారు. అందుకే జనవరి 22 వ తేదీన అయోధ్యలో ఉండే రద్దీ కారణంగా జనవరి 22 వ తేదీన భక్తులు ఎవరూ అయోధ్యకు రావొద్దని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 23 వ తేదీ నుంచి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చని మోదీ సూచించారు. ప్రజలు ఎవరూ అయోధ్యకు వచ్చి ఇబ్బంది పడకూడదనే ఈ సూచన చేస్తున్నట్లు తెలిపారు.
ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వ తేదీ చరిత్రలో విశిష్ఠమైన రోజుగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ రోజున దేశంలోని ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత దేశ చరిత్రలో జనవరి 22 వ తేదీ విశిష్ఠమైన రోజుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి దేశంలోని ప్రతి ఇంటా రామ జ్యోతి వెలిగించాలని సూచించారు. ఒకప్పుడు రామ్ లల్లా టెంట్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని.. కానీ ఇప్పుడు అయోధ్య రాముడికి పక్కా ఇంటిని అత్యంత సుందరంగా నిర్మించామని స్పష్టం చేశారు. ఇక అయోధ్య ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ.. అయోధ్య విమానాశ్రయానికి త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి పేరు పెట్టడం జన్మధన్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. రోజుకు 10 లక్షల మంది రాకపోకలు సాగించేలా మహర్షి వాల్మీకీ ఎయిర్‌పోర్టును నిర్మించినట్లు తెలిపారు. అయోధ్యధామ్‌లో ఎక్కడ చూసినా రామనామమే వినిపించాలని.. అయోధ్యకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని వసతులతో టౌన్‌షిప్‌లను నిర్మిస్తున్నామని వెల్లడించారు.
ఈ ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఎయిర్‌పోర్టులో యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి రైల్వే స్టేషన్‌కు 15 కిలోమీటర్ల మేర మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో అడుగడుగునా జనం మోదీకి నీరాజనం పట్టారు. ఆ తర్వాత ఆధునిక హంగులతో అభివృద్ధి చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని.. మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. దీంతో పాటు రూ.15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.