ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే పార్టీల్లో ఎన్నికల కసరత్తు మొదలు కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్సార్‌సీపీలో మార్పులు చేర్పులతో నేతలు గందరగోళంలో ఉన్నారు. కొందరు నేతలు ముందుగానే సేఫ్ జోన్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా విశాఖలో వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. రెండు రోజుల క్రితమే ఎమ్మెల్సీ వంశీ జనసేన పార్టీకి జైకొట్టారు. తాజాగా మరో సీనియర్ నేత కూడా పార్టీకి రాజీనామా చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ నేత.. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌కు నేరుగా పంపారు. తాను విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
సీతంరాజు సుధాకర్‌కు 20 ఏళ్లకు పైగా వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. 2013లో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. జగన్‌తో పాటు ముఖ్య నేతలకు సన్నిహితంగా ఉన్నారు.. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి తర్వాత విశాఖలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు.. 2021లో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. 2023 ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వర్గపోరు మొదలైంది. పార్టీలో తనకు గౌరవం దక్కలేదని.. అధిష్ఠానం అవమానకరరీతిలో వ్యవహరిస్తోందని సుధాకర్ తన సన్నిహితుల వద్ద వాపోయారని చెబుతున్నారు. రెండు రోజుల నుంచి తన అనుచరులతో విస్తృతంగా మంతనాలు సాగించిన ఆయన శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నారట. తన అనుచరులైన పలువురు కార్పొరేటర్లతో కలిసి ఆయన టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. విశాఖలో ముఖ్యమైన నేతలు ఇద్దరు వరుసగా రాజీనామా చేయడం వైఎస్సార్‌సీపీకి తలనొప్పిగా మారింది. రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాత్రం పార్టీని ఎవరు వీడినా నష్టం లేదన్నారు. విశాఖలో పార్టీ బలంగా ఉందని.. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. త్వరలోనే ఇదంతా ఓ కొలిక్కి వస్తుందని వైఎస్సార్‌సీపీ చెబుతోంది.