జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో కాకినాడ జిల్లా జగ్గంపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కాకినాడలో పవన్ బస చేశారు. చంటిబాబు రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి వచ్చారు. పవన్, నాదెండ్ల మనోహర్‌తో సుమారు గంట పాటు చర్చించినట్లు సమాచారం. చంటిబాబు జగ్గంపేట సీటు వ్యవహారంపై స్పందించారు. పార్టీ మారుతానని ఎప్పుడు చెప్పలేదని.. పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీకి మంచికి జరుగుతుందని అధిష్టానం భావించి వేరే వారిని నియమిస్తే తప్పకుండా ఆహ్వానిస్తానన్నారు. వ్యక్తుల్ని మార్చే సమయంలో కేడర్‌తో సంప్రదించి గ్రూపులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధిష్టానానికి ఉంటుందన్నారు. అందరూ కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుందని.. అందరితో సమన్వయం చేసుకుంటే బావుంటుందన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే పవన్ కళ్యాణ్‌ను కలవడంతో ప్రాధాన్యత ఏర్పడింది.
కాకినాడ జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాల్లో సిటింగ్‌లను వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం మారుస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో జగ్గంపేట కూడా ఉంది.. ఈసారి చంటిబాబుకు అవకాశం లేదనే సంకేతాలు రావడంతో ఆయన వర్గీయులు సీఎం జగన్ తీరుపై నిరసన తెలిపారు. కొందరు పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సైతం తనతో ఉన్నవారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తిస్తే బావుంటుందని.. లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఇటీవల అధిష్ఠానాన్ని హెచ్చరించారు. ఈ క్రమంలో పవన్‌తో చంటిబాబు భేటీ ప్రాధాన్యం ఏర్పడింది. జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరిగింది.. కానీ జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. చంటిబాబు గతంలో టీడీపీలో ఉన్నారు.. జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరి జగ్గంపేటలో విజయం సాధించారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో బస చేస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. స్థానిక జేఎన్‌టీయూకే రోడ్డులో పవన్‌కు స్వాగతం పలుకుతూ ఇటీవల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుక్రవారం అక్కడ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలకు.. జనసేన ఫ్లెక్సీలు అడ్డుగా ఉన్నాయని కొందరు తొలగించి, ట్రాక్టరులో తరలిస్తుండగా జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎవరు తొలగించమన్నారంటూ నిలదీయడంతో ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి వారు వెళ్లిపోయారు. దీంతో జనసేన రూరల్ ఇంఛార్జ్ పంతం నానాజీ, కార్యకర్తలు జేఎన్‌టీయూ దగ్గరకు చేరుకుని తొలగించిన వాటిని తిరిగి ఏర్పాటు చేసేవరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించడంతో రెండు గంటలు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఎవరైతే ఫ్లెక్సీలు తొలగించారో వారితోనే వాటిని పోలీసులు కట్టించడంతో నాయకులు వెనుదిరిగారు.