దేశంలో కరోనా ఉద్ధృతి రోజు రోజుకూ పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మళ్లీ కొవిడ్ వెలుగు చూసిననాటి భయాలు అందరి మదిలో మెదులుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తంగా 743 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులోనే ఏడుగురు కొవిడ్ ధాటికి మృత్యువాత పడినట్లు తెలిపింది. మరోవైపు.. కొవిడ్ కొత్త వేరియంట్ అయిన జేఎన్ 1 కూడా భారీగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు దేశంలో 170 కి పైగా జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3997 కు చేరినట్లు పేర్కొంది. తాజాగా కేసులతో కలిపి దేశంలో కొవిడ్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,50,12,484 కరోనా కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 5,33,358 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు కేరళకు చెందినవారు కాగా.. ఇద్దరు కర్ణాటక.. తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. గత 24 గంటల్లో దేశంలో మరో 830 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. దేశంలో రికవరీ రేటు 98.81 శాతానికి చేరినట్లు వెల్లడించింది.
ఇక దేశంలో జేఎన్ 1 వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ జేఎన్ 1 వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. తొలిసారి అమెరికాలో వెలుగు చూసిన ఈ జేఎన్ 1 వేరియంట్.. భారత్‌లో కేరళలో మొదటిసారి కనిపించింది. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 44 శాతం కేసులు జేఎన్ 1 వేరియంట్‌కు సంబంధించినవని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఇక దేశంలో ఇప్పటివరకు 178 JN 1 సబ్ వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలోని 9 రాష్ట్రాల్లో ప్రస్తుతం జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తి ఉందని పేర్కొంది. అత్యధికంగా గోవాలో 47, కేరళలో 41, గుజరాత్‌లో 36, కర్ణాటకలో 34, మహారాష్ట్రలో 9.. రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో నాలుగు చొప్పున జేఎన్ 1 వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. మరో 2 కేసులు తెలంగాణలో ఢిల్లీలో ఒక కేసు నమోదైంది. ఇక న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి తీవ్ర ఆందోళన చెందుతోంది. జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.