ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేసిన పాక్.

international |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 12:06 AM

2024 కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తూ పాక్‌లో అధికారంలో ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎవరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవద్దని పాక్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వరుల్ హాక్ కాకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్వరుల్ హాక్ కాకర్ వెల్లడించారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోందని.. ఈ సందర్భంగా పాలస్తీనా ప్రజలకు మరోసారి మద్దతు తెలిపిన పాకిస్థాన్.. వారికి సంఘీభావంగా ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలపై పూర్తిగా నిషేధం విధించినట్లు పాక్ ప్రధాని వెల్లడించారు.


ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో మొదటి నుంచి పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్ తాజాగా మరోసారి తన మద్దతును తెలిపింది. గాజా భూభాగంపై ఇజ్రాయెల్‌ సైన్యం చేస్తున్న భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా పాకిస్థాన్‌ ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు పాక్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్‌ హాక్‌ కాకర్‌ తెలిపారు. గురువారం రాత్రి పాక్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని కాకర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైనికులు చేస్తున్న దాడులతో పాలస్తీనాలో తీవ్రమైన యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని.. ఇలాంటి విపత్కర సమయంలో పాలస్తీనా సోదరులు, సోదరీమణులకు సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేసిన కాకర్.. ఈసారి నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి వేడుకలు జరపకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. యుద్ధంతో సతమతమవుతున్న పాలస్తీనాకు ఇప్పటికే తాము రెండుసార్లు మానవతా సాయం అందించామని.. త్వరలోనే మరో విడత మానవతా సాయాన్ని పంపిస్తామని స్పష్టం చేశారు.


ఇక గత కొంతకాలంగా పాక్‌ తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అయితే సాధారణంగానే పాకిస్థాన్‌లో కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా ఏమీ నిర్వహించరు. ఒకవేళ కొందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నా.. కొన్ని గ్రూప్‌లు బలవంతంగా ఆ పార్టీలు, సెలబ్రేషన్స్‌ను అడ్డుకున్న ఘటనలు గతంలో జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా పాక్ ప్రధాని చేసిన ప్రకటనతో పాక్‌లో పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ.. ఇజ్రాయెల్‌ - గాజా యుద్ధంలో తాము పాలస్తీనా వైపు ఉన్నామని మరోసారి పాక్‌ స్పష్టం చేసింది.అయితే.. ఇటీవల ఇజ్రాయెల్‌ - గాజా యుద్ధం, ఆ రెండు ప్రాంతాల మధ్య ఉన్న వివాదంపై పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. రెండు దేశాల విధానం ఇజ్రాయెల్‌కు సమ్మతం కాకపోతే ఏక దేశ విధానమే పరిష్కారంగా కనపడుతోందంటూ ఆరిఫ్ అల్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఒకే దేశంలో యూదులు, ముస్లింలు, క్రైస్తవులు సమానంగా హక్కులు పంచుకుంటూ శాంతి సామరస్యాలతో జీవించాలని ఆరిఫ్ అల్వీ మాట్లాడినట్లు గతంలో పాక్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై పాకిస్థాన్‌లోనే అంతర్గతంగా తీవ్ర విమర్శలు రావడంతో పాక్ అధ్యక్ష కార్యాలయం మరో ప్రకటన విడుదల చేసి దాన్ని ఖండించాల్సి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com