పెళ్లైన ఏడాదిలోపే తన భార్య విడాకుల కోసం కోర్టుకెక్కడంతో భరించలేకపోయిన భర్త.. పుట్టింటిలో ఉన్న ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేయగా.. అడ్డొచ్చిన అత్త, బామ్మర్దిలను కూడా విచక్షణరహితంగా పొడిచాడు. ఈ ఘటనలో అత్త చనిపోగా.. గాయాలపాలైన భార్య, ఆమె సోదరుడు ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదుచేయగా.. నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన 1995 ఆగస్టు 9న చెన్నైలో చోటుచేసుకోగా... 28 ఏళ్ల తర్వాత నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. బ్రహ్మపురానికి చెందిన హరిహర పట్టజోషి చెన్నైలోని ఓ అడ్వర్టైజింగ్ సంస్థ ముద్రణా విభాగంలో పనిచేసేవాడు. అదే సంస్థలో టెలీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న చెన్నైకు చెందిన ఇందిరతో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమకు దారితీయడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో 1994 జులై 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే, పెళ్లైన కొన్నాళ్లకే అతడి నిజస్వరూపం బయటపడింది. భార్యను వేధించడం మొదలుపెట్టాడు. వాటిని భరించలేని ఇందిర విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది.
దీంతో ఆగ్రహించిన పట్టిజోషి అరుంబాక్కం పోలీస్ స్టేషన్ పరిధి నంగనల్లూరులో 1995 ఆగస్టు 9న భార్య, అత్త, బావలపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమ అదేరోజు మృతి చెందగా, ఇందిర, కార్తీక్ ఆసుపత్రిలో చేరారు. అరుంబాక్కం పోలీస్ స్టేషన్‌లో హత్యకేసు నమోదవగా.. నిందితుడు హరిహర పట్టజోషి పరారయ్యాడు. అతడి ఆచూకీ కోసం తమిళనాడు పోలీసులు వివిధచోట్ల గాలించినా ఫలితం లేకపోయింది. పలు రాష్ట్రాల్లో తిరుగుతూ చివరకు తన సొంత రాష్ట్రం ఒడిశాలోని గంజాం జిల్లా అస్కాకు చేరుకున్నాడు. అక్కడ 2001లో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమార్తె ఉంది. బరంహపూర్‌లోని స్పైసెస్ కంపెనీలోనూ.. తర్వాత కేంద్రపరాలో బజాజ్ ఇన్సూరెన్స్ సేల్స్‌మెన్‌గా.. ఓ చిట్‌ఫండ్ కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగాలు చేశాడు. చివరకు గుసానినువాగాం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఆయన్ను గుర్తించి పట్టుకున్నారు. చెన్నై పోలీసులు ట్రాన్సిట్ రిమాండుపై తీసుకెళ్లినట్లు ఎస్పీ చెప్పారు. ఒడిశా, తమిళనాడు పోలీసులు సంయుక్తంగా నిందితుడ్ని పట్టుకున్నారని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం. మంగళవారం ప్రకటనలో తెలిపారు.