తన పుట్టినరోజు నాడే ఓ మహిళా టెక్కీ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఆమెను వివాహం చేసుకోవడానికి లింగమార్పిడి చికిత్స చేయించుకున్న మాజీ క్లాస్‌మేట్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. గొలుసుతో కట్టి, బ్లేడ్‌తో కోసి.. తర్వాత నిప్పంటించి సజీవదహనం చేసిందని పోలీసులు తెలిపారు. ఒళ్లు గగ్గుర్పొడిచే ఈ ఘటన చెన్నై శివారులోని శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రశాంతతకు మారుపేరైన కేలంబాక్కం సమీపంలోని తలంబూర్‌లో 26 ఏళ్ల వెట్రిమారన్ అలియాస్ పాండి మహేశ్వరి.. పుట్టినరోజు సర్ప్రైజ్ ముసుగులో 24 ఏళ్ల నందిని కళ్లకు గంతలు కట్టి, గొలుసులతో చుట్టి, బ్లేడ్‌తో కోసి,పెట్రోల్ పోసి తగలుబెట్టింది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న బాధితురాలు మదురైకి చెందిన నందిని.. చెన్నైలోని తన బంధువుల ఇంట్లో ఉంటోంది. నిందితురాలు పాండి మహేశ్వరి తన పేరు వెట్రిమారన్‌గా మార్చుకుంది. తాంబరం పోలీస్ కమిషనర్ అమల్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఇద్దరూ స్నేహితులు.. చెన్నైలో సహజీవనం చేస్తున్నారు. లైంగిక వేధింపుల గురించి ఇంకా ఎటువంటి సూచనలు లేవు. వెట్రిమారన్ ఇంతకు ముందు హింసాత్మక ధోరణులను ప్రదర్శించాడా అనేది స్పష్టంగా తెలియలేదు.. దర్యాప్తు కొనసాగుతోంది’ అని తెలిపారు. దర్యాప్తులో ఇద్దరి మధ్య బంధంలో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. నందిని, వెట్రిమారన్ మదురైలో కలిసి చదువుకున్నారని, లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా స్నేహాన్ని కొనసాగించారని పోలీసులు చెప్పారు. వారిద్దరూ తోరైపాక్కంలోని ఓ ప్రైవేట్ ఐటీ సంస్థలో కలిసి పనిచేశారని, వారి జీవితాలను మరింతగా పెనవేసుకున్నారని పోలీసులు తెలిపారు.
పోలీసుల అభిప్రాయం ప్రకారం.. నందిని మరొకరిని ఇష్టపడుతుందనే అనుమానంతో వెట్రిమారన్ ఈ దారుణమైన చర్యకు పాల్పడ్డాడు. బర్త్ డే సర్ ప్రైజ్ పేరుతో నందినిని వెట్రిమారన్ ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే అదే ఆమె జీవితానికి పీడకలగా మారుతుందని తెలుసుకోలేకపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గొలుసుతో బంధించిన నందిని కాలిపోతున్నట్లు స్థానికులు గుర్తించి, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మరణించింది. వెట్రిమారన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.