ఏపీలో అంగన్వాడీ వర్కర్ల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. కనీస వేతనాలు, గ్రాట్యుటీ సహా తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత 21 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కొత్త ఏడాది వేళ.. ముగ్గులు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీరుపై అంగన్వాడీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో ఇళ్లల్లో ఉండాల్సిన తమను జగన్ ఇలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టారన్నారని మండిపడుతున్నారు. ‘జగన్ ది రాతి గుండె అని అర్థమైందని.. ఆయనకు కనీసం కనికరం లేదు’ అని అన్నారు.
రాష్ట్రంలో 1.06 లక్షల మంది సమ్మెలో ఉంటే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తారా? అంటూ నిలదీశారు. ‘ఎన్నికలలో ఓట్ల కోసం హామీలు ఇచ్చింది మీరు కాదా?. మీ మాటలను నమ్మి ఓట్లు వేస్తే.. ఇలా అన్యాయం చేస్తారా?. ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆగదు. జగన్ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలి.. కాందంటే మేము మరో మూడు నెలల్లో నొక్కే బటన్‌తో వైసీపీ అడ్రస్ గల్లంతవుతుంది’ అని అంగన్వాడీలు హెచ్చరించారు. జనవరి 3 తేదీలోగా ప్రభుత్వం తమ డిమాండ్లపై నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని అల్టిమేటం జారీచేశారు.
‘సీఎం తన పుట్టిన రోజు కానుకగా వేతనాలు పెంచుతారని భావించాం.. పోనీ క్రిస్మస్ రోజైనా జీతాలు పెంపుపై ప్రకటన చేస్తారని అనుకున్నాం.. కొత్త ఏడాది కానుకగా అయినా డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశపడ్డాం.. కానీ, కుటుంబాలతో ఆనందంగా జరుపుకోవాల్సిన కొత్త ఏడాదిని రోడ్లపై జరుపుకుంటున్నాం.. మా సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ ఎత్తిన ఎర్ర జెండా దింపేది లేదు.. ’ అని శపథం చేశారు. మరోవైపు, అంగన్వాడీల వేతనాలు పెంపు అంశాన్ని ఎన్నికల తర్వాత పరిశీలిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ ఒక్కటి తప్పా మిగతా డిమాండ్లను పరిష్కరించినట్టు ప్రభుత్వం చెబుతోంది.