అయోధ్యలో రామమందిర మహాప్రాణ ప్రతిష్ఠకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న బాలరాముడి విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకకు దేశంలోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను ఆహ్వానించారు. అయితే, మందిర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మాత్రం ఆహ్వానం అందలేదు. దీనిపై స్పందించిన ఆయన.. విమర్శలు గుప్పించారు. రామ మందిర ప్రారంభోత్సవాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దని సూచించారు. ఈ కార్యక్రమం ఒక పార్టీ చుట్టే తిరగకూడదని వ్యాఖ్యానించారు.
ఉద్ధవ్ వ్యాఖ్యలపై అయోధ్య ఆలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ మహా సంప్రోక్షణకు కేవలం శ్రీరాముడి భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందజేశామని చెప్పారు. రాముడి పేరు చెప్పుకుని ప్రతిపక్షంలోని కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రాముడ్ని నమ్మినవారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. (రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని చెప్పడం పూర్తిగా అవాస్తవం, మన ప్రధానిని ప్రతి చోట గౌరవిస్తారని... ఆయన ఎంతో భక్తిపరుడు.. రాముడి పేరు మీద ప్రధాని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించడం తప్పు.. దేశం కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు’ అని ప్రధాన పూజారి కొనియాడారు.
‘భగవంతుడు రాముడిని తమ అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీకి ఇప్పుడు మిగిలి ఉంది’ అన్న శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ‘సంజయ్ రౌత్‌కి చాలా బాధ ఉంది.. అతను దానిని కూడా వ్యక్తీకరించలేడు.. రాముడి పేరు మీద ఎన్నికల్లో పోరాడేవారు. రాముడిని నమ్మిన వారే అధికారంలో ఉన్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారు? రాముడిని అవమానిస్తున్నాడు’ అని ప్రధాన పూజారి అన్నారు.
రామమందిరం ప్రారంభోత్సవం వేళ రౌత్.. బీజేపీపై విరుచుకుపడ్డారు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు రాముడి పేరుతో ఓట్లు అడుగుతారని విమర్శించారు. ‘ప్రధాన మంత్రి కార్యాలయం, ప్రభుత్వం స్థావరాన్ని అయోధ్యకు మార్చాలి. వారు మరేమీ చేయనందున వారు రాముడి పేరు మీద మాత్రమే ఓట్లు అడుగుతారు’ అని రౌత్ విమర్శించారు. రామమందిర ఉద్యమంలో శివసైనికులు తమ రక్తం, స్వేదాన్ని చింధించారని అన్నారు. ‘బాలాసాహెబ్ ఠాక్రే, వేలాది మంది శివసైనికులు దీనికి సహకరించారు.. మేము కూడా రామభక్తులమే, నిజానికి, మేము రామునికి అతిపెద్ద భక్తులం.. మా పార్టీ రామ మందిరం కోసం చాలా త్యాగం చేసింది. వారు దేశాన్ని 5000 సంవత్సరాల వెనుక్కి తీసుకెళ్లారు’ అని సంజయ్ రౌత్ దుయ్యబట్టారు.