గతంలో వైసీపీ పార్టీలో అగ్రవర్ణాలకు అవకాశం కల్పించిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో తాజాగా ఐదు చోట్ల బీసీలను సమన్వయకర్తలుగా నియమించడం గమనార్హం. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం రాత్రి ఈ వివరాలను ప్రకటించారు. గత నెల 11వతేదీన 11 శాసనసభ స్థానాలకు నూతన సమన్వయకర్తలను ప్రకటిస్తూ వైఎస్సార్ సీపీ మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు జాబితాల్లో కలిపి మొత్తం 35 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. కురుబ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణను అనంతపురం లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు. బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ జోలదరాశి శాంత హిందూపురం లోక్‌సభ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని అరకు లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించగా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి,, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషాశ్రీచరణ్‌ను పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి, రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.