జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13,818 వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ మెడికల్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. గుంటూరు రూరల్ మండలం చినపలకలూరులో నిర్వహించిన క్యాంపునకు మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మండలాల వారీగా గ్రామాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం వారానికి రెండురోజుల చొప్పున వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. పట్టణాల్లో వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి బుధవారం, గురువారం ఈ శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 10,032 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాల పరిధిలో 13,818 వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని వైద్య శిబిరాలకు తీసుకురావడం, ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని పెద్ద ఆస్పత్రులకు పంపి ఉచితంగా అందేలా చేయడం ఈ కార్యక్రమంలో ఒక భాగమని ఆమె వెల్లడించారు. రోగి పూర్తిగా కోలుకునే వరకు ఆరోగ్యమిత్ర, ఏఎన్‌ఎంల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.