విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షల విరమణ క్రతువు ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భవానీలు కనక దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్నారు.దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. ఇరుముడిని అమ్మవారికి సమర్పించిన భక్తులు మల్లేశ్వరాలయం మెట్ల మార్గం ద్వారా మల్లికార్జున మహామండప ప్రాంగణానికి, అక్కడి నుంచి హోమగుండాల్లో నేతి కొబ్బరికాయను సమర్పించిన తరువాత గురుస్వామి వద్ద మాల తీయడంతో దీక్ష విరమణ ప్రక్రియ పూర్తవుతుంది.మహామండపం దిగువన హోమ గుండాలతో పాటు గురు భవానీల సమక్షంలో ఇరుముడి విప్పేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీక్షా విరమణలకు ఈ ఐదు రోజుల్లో ఏడు లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తోన్నారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కాగా ఈ నెల 7న మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో కొండపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.జై దుర్గా జైజై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. ప్రత్యేక కౌంటర్లలో గురుభవానీల సమక్షంలో ఇరుముడులను భవానీలు సమర్పిస్తున్నారు. మూడు షిప్టుల్లో 300 మంది గురు భవానీలు ఉన్నారు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు 20లక్షల లడ్డూలను భవానిలకు అందుబాటులో ఉంచారు.