వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎల్లో మీడియా బరితెగింపు రాతలు రాస్తుందని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. మా కుటుంబ సభ్యులను కలిసినా, దానికి రాజకీయాలు ఆపాదించి, కట్టుకథలు అల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైన, ముఖ్యమంత్రిగారిపైనా పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. ఎవరి ద్వారా.. ఏ మధ్యవర్తిత్వం మేము చేయడం లేదు. మా ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు మాకు నీరాజనం పడుతున్నారు. మా పార్టీ చాలా బలంగా ఉంది. ఇది చూసి ఓర్వలేక, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిగారిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక.. ఎల్లో మీడియా రాస్తున్న అడ్డగోలు వార్తలకు నిదర్శనం ఇది. నేను ఈ మధ్య హైదరాబాద్‌కు ఎక్కువగా పోవడం లేదు. అయితే ఎప్పుడు పోయినా తప్పనిసరిగా.. విజయమ్మగారిని, కుటుంబ సభ్యులను కలుస్తాను. ఆమె అమెరికా పోయి వచ్చిన తర్వాత, దాదాపు నెల రోజుల తర్వాత మొన్న ఆదివారం విజయమ్మగారిని కలిసి వచ్చాను. కుటుంబ విషయాలు మాట్లాడి వచ్చాను. ఆ తర్వాత నేను షిరిడి వెళ్లాను. ప్రతి ఏటా జనవరిలో షిరిడి వెళ్లడం నాకు అలవాటు. దాంతో నేను నిన్న ఈ పేపర్ కూడా చూడలేదు. రాత్రి విజయవాడ వచ్చాక చూశాను. వారి రాతలు పరాకాష్టకు నిదర్శనం. వారు ఏ స్థాయిలో ఉన్నారంటే.. చంద్రబాబునాయుడును, ఆయన దత్తపుత్రుడిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎలా బురద చల్లుతున్నారనడానికి ఇది పరాకాష్ట. చివరకు కుటుంబ సభ్యులను కూడా బజారుకీడుస్తున్నారు. ఇంత నీచాతినీచమైన పరిస్థితి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పిన మీడియా ద్వారా వచ్చింది అని అన్నారు.