ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక వైఎస్సార్‌సీపీకి ఇబ్బందులు తప్పవన్నారు. షర్మిల తన తండ్రిని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలిపారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలను షర్మిల స్వీకరించిన తర్వాత ఎంతో మంది కాంగ్రెస్ నేతలు సొంతగూటికి చేరే అవకాశం ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడం వల్ల సుమారు 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని.. వారికి మరొక ప్రత్యామ్నాయం లేదన్నారు. టీడీపీ, జనసేన పార్టీలలో చేరినా వారికి టికెట్ దక్కే అవకాశాలు లేవన్నారు. ఎందుకంటే రెండు పార్టీలలోనూ అభ్యర్థుల ఎంపికపై దాదాపుగా కసరత్తు పూర్తయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిన్న మొన్నటి వరకు సరైన అభ్యర్థులే లేరని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏడు శాతం ఓటు బ్యాంకును సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీకి దన్నుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లకు డ్యామేజ్ అవుతుందన్నారు.
రాష్ట్రంలో 20 శాతం ఉన్న క్రిస్టియన్ మైనార్టీలతో పాటు, ముస్లిం మైనార్టీల వెన్నుదన్నుతో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో కొన్ని స్థానాలలో గెలిచినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 30 నుంచి 35 స్థానాలలో గెలిచే అవకాశం ఉందని తాను గతంలో చెప్పానని.. నాలుగో తేదీ తర్వాత కేవలం 20 స్థానాల లోపుకు వైఎస్సార్‌సీపీ దిగజారి పోతుందన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిసి కొంత మంది అవాకులు చవాకులు పేలుతున్నారని.. ఇన్నాళ్లు వారందరికీ షర్మిల ఎంతో అండదండగా ఉన్నారని విషయాన్ని విస్మరించవద్దు అన్నారు.
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను ఫైనల్ చేయకపోవడంతో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు రఘురామకృష్ణ రాజు. వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌లు వాలంటీర్లతో కలిసి ఇల్లు,ఇల్లు తిరిగి వృద్ధులకు పింఛన్లను అందజేస్తారట.. ఇంఛార్జ్‌లను ఫైనల్ చేయడానికి వృద్ధాప్య పింఛన్లు పంపిణీకి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలను బహిరంగ సభలకు హాజరు కావాలని వేధిస్తుంటే వారు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. అలాగే ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఆందోళనలతో పాటు, కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక తన ప్రస్తుత పార్టీని సునామీ మాదిరిగా సెలెక్టివ్ గా ముంచి వేయబోతోందని అన్నారు.