విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖకు కార్యాలయాల తరలింపుపై చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్ల విచారణ నుంచి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు తప్పుకున్నారు. రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు మంగళవారం హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. మరో బెంచ్ ముందుకు అప్పీళ్లు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. అయితే మరో ధర్మాసనం వద్ద త్వరగా విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ తరఫు లాయర్ అభ్యర్థించారు.
సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలిస్తున్నారంటూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిని త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రాష్ట్రప్రభుత్వం హైకోర్టు సింగిల్ జడ్జిని కోరింది. దీంతో పిటిషన్లపై తగిన ధర్మాసనం విచారణ చేపట్టే వరకు అమరావతిలోని సచివాలయం నుంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు చర్యలు చేపట్టవద్దని హైకోర్టు సింగిల్ జడ్జి డిసెంబరు 21న ఉత్తర్వులిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపాలా? లేదా అనే వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును నిలువరించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరు 22న జారీ చేసిన జీవో 2283ని రద్దు చేయాలని కోరారు. ఇదే వ్యవహారంపై రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య సొసైటీ ఉపాధ్యక్షుడు కల్లం రాజశేఖర్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.