న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా యూత్ బాగా ఎంజాయ్ చేశారు. అయితే అనకాపల్లి జిల్లాలో మాత్రం స్కూల్ విద్యార్థుల మందుపార్టీ వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. చోడవరంలో ఉన్న ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న 6, 7, 10 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులు డిసెంబరు 31వ తేదీ రాత్రి హాస్టల్ గోడదూకి బయటకు వెళ్లారు. బయటి నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులతో కలిసి హాస్టల్ సమీపంలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంటులో బిర్యానీ, మందు పార్టీ చేసుకున్నారు. వీరు రాత్రంతా మద్యం మత్తులో ఊగారు. వారంతా అల్లరి చేస్తుండటాన్ని గమనించిన ఏసీ మెకానిక్, డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ ఈ సీన్ మొత్తాన్ని మొబైల్‌లో వీడియో తీశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు విద్యార్థులు వారిని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఏసీ మెకానిక్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. 31వ తేదీ రాత్రి పది గంటల వరకూ తాను హాస్టల్‌లోనే ఉన్నానని వార్డెన్ చిన్నయ్య అంటున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లానని చెబుతున్నారు. తాను హాస్టల్ నుంచి వెళ్లిన తరువాత విద్యార్థులు ఏం చేశారో తెలియదన్నారు. హాస్టల్ నుంచి వెళ్లిన విద్యార్థులు ఇలా మందు పార్టీ చేసుకోవడం చర్చనీయాంశమైంది.