తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు మరోసారి భారీగా తరలివచ్చారు. పదిరోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం కావడం.. సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడంతో నూతన సంవత్సరం వేళ సాధారణ భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. సోమవారం రాత్రంతా అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద క్యూలైన్లలో వేచిఉండి.. మంగళవారం తెల్లవారుజామున సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లు తీసుకున్నారు. శ్రీనివాసం లోపల క్యూలైన్లు నిండి బయట బస్టాండు వరకు కొనసాగింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రారంభమైన టోకెన్ల జారీ ఉదయం 8.45కి ముగిసింది. మొత్తం 17,500 టోకెన్లు జారీచేశారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి బస్సుల్లో వచ్చిన కుటుంబాలు.. భూదేవి కాంప్లెక్స్ వద్దనే ఆరుబయట చలిలో వేచిఉండి టికెట్లు పొందారు. గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్ల జారీని నిలిపివేశారు. అక్కడ నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టనుండటంతో మిగిలిన మూడు కేంద్రాల్లో మాత్రమే సర్వదర్శన టైమ్‌స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా మంగళవారం సాయంత్రానికి క్యూలైన్లలలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 26 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 12 గంటల్లో దర్శనం లభించనుందని టీటీడీ తెలిపింది. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 1న ముగిసింది.. అలాగే వారం రోజులుగా సర్వ దర్శన టికెట్లు జారీ చేయకపోవడంతో భక్తుల రద్దీ భారీగా కనిపించింది. ఇప్పుడు తిరుపతిలో సర్వ దర్శన టికెట్లు జారీ చేస్తుండటంతో ఒక్కసారిగా రద్దీ కనిపించింది.
6.47 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబరు 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 లక్షల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. దర్శించుకున్న భక్తులతోపాటు అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందని చెప్పారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేశామన్నారు.
10 రోజులకు కలిపి వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామని.. 18,578 మంది హాజరుకాగా.. 677 మంది(3.3 శాతం) గైర్హాజరయ్యారని తెలిపారు. దాతలకు బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆన్‌లైన్‌లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నారని, 6,388 మంది హాజరుకాగా, 470 మంది(7 శాతం) గైర్హాజరయ్యారని వివరించారు. శ్రీవాణి దాతలకు మొత్తం 20 వేల ఎస్ఇడి టికెట్లు జారీ చేశామని, 19,083 మంది హాజరుకాగా, 917 మంది(4.5 శాతం) గైర్హాజరయ్యారని తెలియజేశారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారని, 1,97,524 మంది హాజరుకాగా, 27,476 మంది(12.2 శాతం) గైర్హాజరయ్యారని తెలిపారు. సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మొత్తం 4.23 లక్షలు మంజూరు చేశామని, 3,24,102 మంది హాజరుకాగా, 90,850 మంది(21.5 శాతం) గైర్హాజరయ్యారని వెల్లడించారు.