కేరళలోని శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇటీవలె మండల పూజల ఉత్సవాలు ముగియగా.. మళ్లీ ఆలయాన్ని తెరిచి మకరవిళక్కు ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే శబరిమల అయ్యప్ప ఆలయ వ్యవహారాలు చూసే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10 వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్‌లను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.
రోజు రోజుకూ శబరిమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు. ఇక మకరజ్యోతి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తారని.. అప్పుడు మరింత కష్టమవుతుందని అందుకే స్పాట్ బుకింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 14 వ తేదీన వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని 50 వేలకు పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఈనెల 15 వ తేదీ మకర సంక్రాంతి రోజున కేవలం 40 వేల మందికి మాత్రమే బుకింగ్‌లు పరిమితం చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.
సాధారణంగా మకరవిళక్కు దర్శనానికి 3 రోజులు ముందుగా వచ్చే అయ్యప్ప భక్తులు సన్నిధానం నుంచి బయలుదేరే శబరిమల వివిధ ప్రాంతాల మకరవిళక్కు, తిరువాభరణ దర్శనానికి వెళ్తారు. ఈనెల 14 వ తేదీ, 15 వ తేదీన పిల్లల క్యూ లైన్‌లోకి భక్తులకు అవకాశం ఉండదని వారి క్యూ లైన్‌లో దర్శనానికి వెళ్లకూడదని ట్రావెన్‌కోర్ ఆలయ బోర్డు తెలిపింది. ఈ నెల 16 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు అనేక మంది భక్తులు వస్తారని భావించి.. వారికి దర్శనాలకు, వసతి ఏర్పాటు చేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పేర్కొంది. ఇక ఈసారి శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. నవంబర్ 17 వ తేదీ నుంచి డిసెంబరు 27 వ తేదీ వరకూ 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. దీంతో ఏకంగా రూ.241 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే గతేడాది కంటే రూ.18.72 కోట్లు అధికంగా వచ్చినట్లు పేర్కొన్నాయి. ఈ ఆదాయం లెక్కింపు పూర్తి కాలేదని.. మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి.