దేశ వ్యాప్తంగా సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండా బియ్యం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 26 శాతం వరకు బియ్యం ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త బియ్యం తినలేక.. పాత బియ్యం కొనలేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్ సన్న బియ్యం ధర సుమారుగా రూ.6,500 కు చేరింది. ఇదే అదనుగా భావించి పలువురు రైస్ డీలర్లు మరింత ధరలు పెంచుకుంటున్నారు. దీంతో రిటైల్ మార్కెట్‌లో 25 కిలోల పాత బియ్యం ధర రూ.1500 పైగా పలుకుతోంది. అయితే గతేడాది ఇదే సమయానికి మార్కెట్‌లో సన్న బియ్యం ధర క్వింటాల్‌కు రూ.3000 నుంచి రూ.3500 వరకు ఉంది. కానీ ప్రస్తుతం రూ. 6 వేల నుంచి రూ.6500 వరకు చేరింది.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి
గత కొన్ని నెలలుగా దేశంలో నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగానే పంటల ఉత్పత్తుల దిగుబడి బాగా తగ్గిపోవడంతో బియ్యం కొరత ఏర్పడుతోంది. అయితే దేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగానే పంట ఉత్పత్తి దెబ్బతిని బియ్యం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో పంట చేతికి వచ్చిన సమయానికి భారీ వర్షాలు, వరదలు రావడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో పంట దిగుబడి తగ్గి.. డిమాండ్ పెరగడంతో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఈ వర్షాకాలంలో చాలా మంది రైతులు అధిగ దిగుబడి కోసం సన్న రకం వడ్ల స్థానంలో దొడ్డు రకం వడ్లను పండించారు. దీంతో పంట దిగుబడి బాగా తగ్గటం వల్లే సన్న బియ్యం ధరలు భారీగా పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఇక దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విదేశాలకు ఎగుమతి అయ్యే బియ్యంపై ఆంక్షలు విధించింది. మొదట బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. ఆ తర్వాత పూర్తిగా ఆంక్షలు వేసింది. అయినా బియ్యం ధరలు అదుపులోకి రాకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీ కింద రూ.25 కే కిలో బియ్యాన్ని భారత్ రైస్ పేరుతో పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గోధుమ పిండి, పప్పు ధాన్యాలను ప్రజలకు భారత్ ఆటా, భారత్ దాల్ పేరిట రాయితీ ధరలకే కేంద్రం ఇప్పటికే అందిస్తోంది. ఈ క్రమంలోనే బియ్యం ధరలు పెరిగిపోవడంతో భారత్ రైస్ పేరిట బియ్యాన్ని అందించాలని నిర్ణయించింది. అయితే అందుకోసం నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా -నాఫెడ్, నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ - ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్ అవుట్‌లెట్ల ద్వారా రూ.25 కే కిలో బియ్యాన్ని విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.