ఏలూరు జిల్లాలో అరుదుగా కనిపించే పునుగు పిల్లి జాతికి చెందిన మానుపిల్లి ప్రత్యక్షమైంది. జన సంచారం ఉన్న ప్రాంతంలో ఈ పిల్లి కనిపించడం చర్చనీయాంశమైంది. పెదపాడు మండలం అప్పనవీడు పంచాయతీ తాళ్లమూడిలో ఉజ్జనేని సాయికుమార్ తన ఇంటి దగ్గర నాటుకోళ్లు పెంచుతుంటారు. కొన్ని రోజులుగా కోళ్లను రాత్రి సమయాల్లో జంతువులు వచ్చి ఎత్తుకు పోతుండటంతో వాటిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పిల్లిలాంటి జంతువు ఒకటి కోడిని తినేందుకు బోనులోకి వెళ్లి చిక్కుకుంది. సాయికుమార్ గురువారం ఉదయం బోనులో చూడగా ఆ జంతువు కన్పించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఎఫ్‌వోతో పాటు అధికారులు వచ్చి ఆ జంతువును చూసి అది పునుగుపిల్లి జాతికి చెందిన మానుపిల్లి అని తెలిపారు. ఇవి సాధారణంగా జన సంచారం లేని నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి అన్నారు. మాను పిల్లిని స్వాధీనం చేసుకున్న అధికారులు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచర్ల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టారని సాయి కుమార్ తెలిపారు. ఈ మాను పిల్లిని చూసేందుకు జనాలు క్యూ కట్టారు.