తాను వైఎస్సార్‌సీపీలో ఉంటే బంగారం.. బయటకు వస్తే స్క్రాపా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య. తన కోడలు, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి ఇద్దరూ క్లాస్‌మేట్స్ అని.. అందుకే తాను పార్టీ మారానని ప్రచారం చేస్తున్నారన్నారు. రాజంపేట ఎమ్మెల్యే టికెట్టు తన కుమారుడికి ఇప్పించుకునేందుకు వచ్చారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. అవన్నీ అవాస్తవాలన్నారు. టీడీపీ, జనసేన సంయుక్త పాలనలో రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించి టీడీపీలో చేరానని.. . త్వరలోనే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నందునే ఎమ్మెల్సీగా మరో మూడేళ్ల పదవీకాలం ఉన్నా రాజీనామా చేస్తున్నానన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తాను ప్రజాజీవితంలో రాజీపడకుండా విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నానన్నారు. కొన్ని నెలల నుంచి అంతర్మథనపడుతూనే ఉన్నానని.. ఇక ఓపికలేక వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరానన్నారు. సీఎం జగన్‌తో మనసువిప్పి మాట్లాడలేకపోయానని.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోవాలన్నారు. కొంతమంది సలహాదారులు వాస్తవాలను, ప్రజా అభిప్రాయాలను నిక్కచ్చిగా సీఎంకు చెబితే బాగుంటుందన్నారు.
సీఎం జగన్ తన స్వలాభం, కేసుల నుంచి తప్పించేకునేందుకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులపై ప్రశ్నించకుండా రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీలో ప్రజాస్వామ్యం లేదని అందుకే తాను బయటకు వచ్చానన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. వైఎస్సార్‌సీపీ అరాచకపాలనలో భాగస్వామ్యం కాకూడదనే.. ఆ పార్టీ నుంచి బయటకు వస్తే తనపై అక్కసు వెళ్లగక్కుతూ తనపై ఇష్టమొచ్చినట్లు కథనాలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని శాసించే అమెరికా, చైనా అధ్యక్షులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వయసు 70 పైమాటేనన్నారు.
కోర్టులు చీవాట్లు పెడుతున్నా మారకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి రూ. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు రామచంద్రయ్య. ప్రస్తుతం రాష్ట్రానికి ఆదాయం చేకూర్చే సెక్టార్లు దెబ్బతిన్నాయని తెలిసి కూడా తప్పులు చేస్తున్నారన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కరవైందని.. వాటిని కాపాడటంలో పాలకులు విఫలమయ్యారన్నారు. కార్యకర్తలు ఏమి చెప్పినా మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ వినేవారని, అందుకే ప్రజల అభీష్టం మేరకు పనులు జరిగేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.12లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఇక అప్పులు ఇచ్చేవారు లేరన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. ఆయనకు సీఎం పదవి ముళ్లకిరీటమే అని అభిప్రాయపడ్డారు. ఒక వేళ మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రక్షించేవారే ఉండరన్నారు. సీ రామచంద్రయ్య ఇటీవలే వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa