దివంగత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించి 9 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి అధికారంలోకి వచ్చారని, ఈరోజు చరిత్రాత్మికమైన దినోత్సవమని, మంగళవారంతో 40 ఏళ్లు పూర్తి చేసుకోబోతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ... అధికారంలో ఉంటే ప్రజా సేవ, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తూ టీడీపీ ముందుకు వెళ్తుందన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు వైసీపీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారని.. స్థానిక సంస్థల్లో కూడా అవకాశం ఇచ్చారన్నారు. సీట్లు వచ్చాయా లేదా అని ఆలోచన చేయకుండా టీడీపీ ప్రజల వైపు నిలిచిందన్నారు.తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు రెడ్లంటే ప్రత్యేకత ఉందని, పారిశ్రామికంగా దేశ వ్యాప్తంగా నెల్లూరుకు మంచి పేరు ఉందని, అలాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు తమ వ్యాపారాలకు పెద్ద పాలేర్లలా మారిపోవాల్సి వచ్చిందని బీదా రవిచంద్ర అన్నారు. సోమిరెడ్డి అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటే హిజ్రాలని పంపించి అరాచకం సృష్టించారని మండిపడ్డారు. జగన్ వైసీపీ నేతలకంటే... హిజ్రాలనే నమ్ముకున్నట్లు ఉన్నారని, హిజ్రాలను అసాంఘిక కార్యక్రమాలకు వాడుకున్న పార్టీ వైసీపీ అని, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ టీడీపీని గెలిపించుకోవడానికి కృషి చేయాలని పిలుపిచ్చారు. సంపూర్ణ మెజారిటీని నెల్లూరు జిల్లా నుంచి ప్రజలు ఇవ్వాలన్నారు. నెల్లూరు జిల్లాలో నలుగురు ఎంపీలు ఉన్నారని, ఇద్దరు మంత్రులు... పదిమంది ఎమ్మెల్యేలు ఏమి చేసారో చెప్పాలని బీదా రవిచంద్ర డిమాండ్ చేశారు. ప్రజలకు ఏమి చేయలేక పదవులు మాకెందుకు అని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, మేకపాటి బయటకి వచ్చేసారన్నారు. సామాజిక బస్సు యాత్రను ఎందుకు ఆధరించాలని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మీరు ఏం చేశారో చెప్పగలరా? అని నిలదీశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, సారాయి విచ్చలివిడిగా దొరుకుతోందన్నారు. వైసీపీ ఇచ్చిన నవరత్నాల హామీల్లో 15 శాతం అన్ని పూర్తి చేశారా?.. వైసీపీని కోరుకున్న రెడ్లకు ఆ పార్టీ చుక్కలు చూపిస్తోందని.. ఇప్పటికైనా ఆలోచించాలని బీదా రవిచంద్ర సూచించారు.