వచ్చే ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత, ఓటర్ల జాబితాపై విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ సమీక్షించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటుగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ఆప్ నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై విపక్ష నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు. . సమావేశానికి ముందు చంద్రబాబు, పవన్ నోవాటెల్‌లో భేటీ అయ్యారు. ఈసీకి నివేదించాల్సిన అంశాలపై వీరిద్దరూ చర్చించారు.
ఓటరు జాబితాలో అవకతకవలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా అరాచకాలు జరుగుతున్నాయని.. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ప్రజల్లో తిరుగుబాటు చూసే నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర జరుగుతోందని.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు.ఎన్నికల విధులకు అనుభవం ఉన్నవారిని నియమించాలని కోరామన్నారు. అలాగే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం అధికారుల్ని కోరినట్లు తెలిపారు. పోలీసులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. దొంగ ఓట్లపై ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న విషయాన్ని ఈసీకి వివరించినట్లు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు, నాయకులే లక్ష్యంగా కేసులతో వేధిస్తున్నారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉండే మహిళా పోలీసుల్ని బీఎల్‌వోలుగా నియమించారని.. ఈ నిర్ణయం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని.. తెలంగాణలో ఇటీవల ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో కూడా అంతే ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. ఏపీలో ఉపాధి దొరక్క చాలామంది ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లారని.. అలాంటి వాళ్ల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కోసం వెళ్లినవారు సొంత ఊరిలో ఓటు వేసే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు.
వై ఏపీ నీడ్స్ జగన్‌కు కలెక్టర్లతో ప్రచారం చేయిస్తున్నారని.. ప్రజల తిరుగుబాటు చూసి నకిలీ ఓటర్లను చేర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అరాచకాలను సీఈసీకి వివరించామని.. ఏపీలో ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించాలని కోరామని తగిన విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. అలాగే దొంగ ఓట్లకు సంబంధించిన సాక్ష్యాలను కూడా ఎన్నికల సంఘం అధికారులకు అందజేసినట్లు చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఎన్నికలు సజావుగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రవ్యాప్తంగా భారీగా దొంగ ఓట్లు చేర్చారని.. లా&ఆర్డర్ దిగజారిపోయిందన్నారు. రెండు నెలలముందే పోలీసులను మార్చి నోటిఫికెషన్ సమయానికి వాళ్లు తిరిగి వచ్చేలా ప్లాన్ చేశారని.. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టమని కోరామన్నారు. ఫ్రీ & ఫెయిర్ ఎన్నికలు జరుగుతాయని.. ప్రభుత్వం మారుతుందని ధీమాను వ్యక్తం చేశారు జనసేనాని.