రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ ఫైనల్ చేసింది. మూడు స్థానాలకూ కొత్త అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేశారు. జగన్ చిన్నాన్న.. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రానికి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వైఎస్సార్‌సీపీ), కనకమేడల రవీంద్రకుమార్(టీడీపీ), సీఎం రమేష్(బీజేపీ)ల పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుండటంతో వచ్చే నెలాఖరులో ఈ మూడు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఈ సారి నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించనున్నారు. ఇక మిగిలిన రెండు సీట్లు వైఎస్సార్‌సీపీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ముగ్గురు అభ్యర్థుల్ని ఖరారు చేసింది.
ఈ ముగ్గురి ఎంపికలో కూడా సామాజిక వర్గాల వారీగా నిర్ణయం తీసుకున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేశారు. మిగిలిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు.. అందుకే ఎమ్మెల్యే గొల్ల బాబురావువైపు మొగ్గు చూపారు.అలాగే బలిజ సామాజిక వర్గం నుంచి జంగాలపల్లి (ఆరణి) శ్రీనివాస్‌కు ఛాన్స్ ఇచ్చారు. గొల్ల బాబూరావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలో.. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కంబాల జోగులకు అవకాశం ఇచ్చారు. అలాగే చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరిని పెద్దల సభకు పంపుతున్నారు. ఈ మూడు స్థానాలు దక్కితే రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ బలం 11కు చేరనుంది.