గ్రామీణ స్థాయిలో మెరికల్లాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం.. ఆంధ్రా క్రీడా పోటీలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోలాహలంగా నిర్వహిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతిభను వెలికితీసేందుకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ఆడుదాం ..ఆంధ్రా పోటీల స్ఫూర్తితో వైయస్ఆర్‌సీపీ యువ నాయకుడు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కుమారుడు శిల్పా కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో అతిపెద్ద క్రీడా సంబరానికి శ్రీకారం చుట్టారు .కార్తీక్‌రెడ్డి ప్రీమియర్ లీగ్ పేరుతో తలపెట్టిన టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. క్రీడా సంబరం ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించి పట్టణపురవీధుల్లో వైయస్ఆర్‌సీపీ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు.