కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్రకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. అదే జోష్‌తో 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. రెండో విడత యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆ యాత్రకు భారత్ న్యాయ్ యాత్ర అని పేరు కూడా పెట్టింది. ఈ భారత్ న్యాయ్ యాత్రను మణిపూర్ నుంచి ముంబై వరకూ నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మణిపూర్‌లో భారత్ న్యాయ్ యాత్ర చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
ముందుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రకారం ఇంఫాల్ తూర్పు జిల్లా హట్టా కంగ్జిబుంగ్ నుంచి ఈ నెల 14 వ తేదీ నుంచి భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం బుధవారం అనుమతి నిరాకరించింది. భారత్ న్యాయ్ యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందిగా.. మణిపూర్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కే. మేఘచంద్ర.. తమ పార్టీ నేతలతో కలిసి సీఎం ఎన్ బీరెన్ సింగ్‌తో బుధవారం ఉదయం సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ మణిపూర్‌లో చేపట్టనున్న యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే మణిపూర్‌లో ప్రస్తుతం నెలకొన్న శాంతి భద్రతల పరిస్ధితి కారణంగా యాత్రకు అనుమతి ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ నేతలకు సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. ఈ భేటీ అనంతరం మాట్లాడిన మణిపూర్ పీసీసీ చీఫ్ మేఘచంద్ర.. మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అయితే ఇంఫాల్ తూర్పు జిల్లా హట్టా కంగ్జిబుంగ్‌లో ప్రారంభం కావాల్సిన ఉన్న భారత్ న్యాయ్ యాత్రకు అనుమతి నిరాకరించడంతో తౌబల్ జిల్లాలోని ఖోంగ్జాంలోని ఓ ప్రైవేట్ స్ధలానికి వేదికను మార్చతున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఇక ఈ భారత్ న్యాయ్ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు 14 రాష్ట్రాలు, 85 జిల్లాల మీదుగా సాగనుంది. ఈ భారత్ న్యాయ్ యాత్రను కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు. వాహనాలతో పాటు పాదయాత్రగా భారత్ న్యాయ యాత్ర సాగుతుందని హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి.