ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీవీ స్టూడియోలోకి చొరబడి.. లైవ్‌లో న్యూస్ ప్రజెంటర్‌కు తుపాకీ గురిపెట్టిన ముష్కరులు!

international |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 09:19 PM

టీవీ స్టూడియోలోకి ప్రవేశించిన సాయుధులు.. లైవ్‌లో న్యూస్ ప్రజెంటర్‌కు తుపాకి ఎక్కుపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. సంచలనం రేపుతోన్న ఈ ఘటన ఈక్వెడార్‌ రాజధాని గ్వయకిల్‌లో చోటుచేసుకుంది. మంగళవారం సాయుధులైన కొందరు దుండగులు టీసీ టీవీ ఛానెల్‌ లైవ్‌ స్టూడియోలోకి ప్రవేశించారు. గుర్తుపట్టకుండా మాస్క్‌లు ధరించి తుపాకులు, డైనమైట్‌లతో చొరబడి... వార్తలు చదువుతున్న వ్యక్తి సహా అక్కడ ఉన్న ఇతర ఉద్యోగులను బెదిరించారు. నేలపై పడుకోబెట్టి, చేతులను వెనక్కి పెట్టించి తలపై తుపాకీలను ఎక్కుపెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ ఇక్కడికి రారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.


ఈ తతగమంతా టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కాగా.. లైవ్‌లో తుపాకీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు వెల్లడించారు. 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ దాడికి వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియరాలేదు. ఇటీవల ఈక్విడార్‌లోని అత్యంత శక్తివంతమైన క్రిమినల్ ముఠాకు చెందిన ఇద్దరు జైలు నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాతే అక్కడ వరుసగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. తాజా ఘటన కూడా అందులో భాగమే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఇటీవలి సంవత్సరాలలో మెక్సికో, కొలంబియా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్న గ్యాంగస్టర్లను కట్టడి చేయడానికి ఈక్వెడార్ చర్యలు చేపట్టడంతో హింస చెలరేగింది. ‘ఈ సమూహాలను నిర్వీర్యం చేయడానికి సైనిక కార్యకలాపాలను నిర్వహించాలని నేను సాయుధ బలగాలను ఆదేశించాను’ అని ఆ దేశాధినేత డేనియల్ నోబోవా వెల్లడించారు. టీవీ స్టూడియోలో దాడి జరిగిన కొద్ది సేపటికే ఈ ప్రకటన చేశారు. డ్రగ్స్ సరఫరా చేసే 20 ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన ఆయన.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముఠా సభ్యులను కనిపిస్తే కాల్చివేతకు సైనికులకు అధికారం ఇచ్చారు. దేశం ప్రస్తుతం అంతర్గత సాయుధ ఘర్షణలను ఎదుర్కొంటోందని ఆయన ప్రకటించారు. ఈక్వెడార్‌లో శాంతిని పునఃస్థాపించే వరకు పోరాడతామని తెలిపారు.


తాజాగా ఘటనపై టీసీ టీవీ ఛానెల్‌ అధిపతి మాన్రిక్ భయాందోళనకు గురయ్యారు. ఈ దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘దుండగులు స్టూడియోలోకి చొరబడినప్పుడు నేను కంట్రోల్‌ రూమ్‌లో ఉన్నాను.. వారిలో ఒకడు నా దగ్గరకొచ్చి తలపై తుపాకీ గురిపెట్టాడు.. నేలపై కూర్చోవాలని బెదిరించాడు.. నేనింకా షాక్‌లోనే ఉన్నాను. దేశం విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనిపిస్తోంది’ అని ఆవేదనకు గురయ్యారు. స్టూడియోలో జరిగిన ఈ ఘోరం దాదాపు 15 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైందని చెప్పారు. భద్రతా బలగాలు చుట్టుముట్టారని గుర్తించిన దుండగులు తర్వాత తప్పించుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈక్వెడార్‌లో జరుగుతోన్న వరుస దాడులు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా అపహరణకు గురయ్యారు. జైలు నుంచి గ్యాంగ్‌స్టర్లు తప్పించుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అత్యవసర పరిస్థితి విధించిన నొవోబా.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైనిక బలగాల మోహరింపునకు ఆదేశాలు జారీ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com