వరి ధాన్యం రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి కానుక అందజేశారు. ధాన్యం సేకరణకు సీఎం రూ. 2006 కోట్లు నిధులు విడుదల చేశారు. దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకి వీటిని జమచేస్తున్నారు. మొత్తం లక్ష 77 వేల రైతుల ఖాతాలోకి నగదు జమ చేస్తున్నారు. ఇప్పటివరకు 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. 4.09 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మొత్తం రూ.5 వేల కోట్లు చెల్లించామని, 21 రోజుల్లోపే వారి ఖాతాలకు నగదును జమ చేస్తున్నామని మంత్రి కారుమూరి అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నూర్పిడి చేసిన వెంటనే రైతు భరోసా కేంద్రం సిబ్బంది రైతుల నుంచి ధాన్యం సేకరించి మిల్లులకు తరలిస్తున్నారు. ఈ ధాన్యానికి సంబంధించిన డబ్బులు 21 రోజుల్లోనపే జమచేస్తున్నారు. ఆర్‌బీకేలకు తరలించిన ధాన్యానికి ఆపరేటర్లు వెంటనే రైతులకు చెందిన ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్‌లను అప్‌లోడ్‌చేసి కూపన్లు జారీచేస్తున్నారు. దీనివల్ల రైతులకు సకాలంలో నగదు వారి వ్యక్తిగత ఖాతాలకు జమవుతోంది. గతేడాది డిసెంబరు మొదటి వారంలో మిచౌంగ్ తుఫాన్ ముంచుకురావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే తరలించేలా ఏర్పాట్లు చేసింది. నూర్పిడులు చేసి ఆరబోతకు వచ్చిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. తుఫాన్ ప్రభావంతో ఆన్‌లైన్ విధానానికి బదులుగా ఆఫ్‌లైన్‌లో ప్రత్యేక ఎంట్రీల ద్వారా ధాన్యాన్ని సేకరించింది.