ఏపీ ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పొడిగించింది. ఇవాళ కేందమంత్రి జి కిషన్‌రెడ్డి గుంటూరులో ఈ రైళ్లను ప్రారంభిస్తారు. విశాఖపట్నం-విజయవాడ మధ్య నడుస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ (22701/22702) రైలును గుంటూరు వరకు పొడిగించారు. అలాగే కర్ణాటకలోని హుబ్లీ నుంచి విజయవాడ వరకు నడుస్తున్న అమరావతి ఎక్స్‌ప్రెస్ (07284/07285) నరసాపురం వరకు.. నంద్యాల-కడప (07284/07285) వరకు నడుస్తున్న ప్రత్యేక రైలును రేణిగుంట వరకు పొడిగించారు. ఈ పొడిగింపు 13వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
ఉదయ్ డబుల్ డెక్కర్ పొడిగింపుతో గుంటూరు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి విశాఖపట్నానికి రాకపోకలకు సులభంగా ఉంటుంది అంటున్నారు. అమరావతి ఎక్స్‌ప్రెస్ పొడిగింపుతో నరసాపురం, భీమవరం ప్రాంతవాసులకు గుంతకల్, బళ్లారి, హుబ్లీ వరకు నేరుగా రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. విజయవాడలో రైలు మారాల్సిన అవసరం ఉండదంటున్నారు. నంద్యాల-కడప రైలును రేణిగుంట వరకు పొడిగించడంతో నంద్యాల, కడప, చుట్టుపక్కల ప్రాంతవాసులు తిరుమల చేరేందుకు అవకాశం ఉంటుంది. 17225 నర్సాపురం - హుబ్లీ రైలు నర్సాపురంలో సాయంత్రం 4.10 గంటలకు బయలు దేరి పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడల మీదుగా విజయవాడకు 7.40కి వస్తుంది.. ఆ తర్వాత 7.55కు విజయవాడ నుంచి బయలు దేరి గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంబం, గిద్దలూరు మీదుగా తెల్లవారు జామున 2.20 గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది.
ఈ రైలు (17226) హుబ్లీ - నర్సాపురం ఎక్స్‌ప్రెస్ రైలు హుబ్లీలో మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరి నంద్యాలకు రాత్రి 9.10కి చేరుకొని తెల్లవారు జామున 3.40కి విజయవాడకు చేరుకుంటుంది. ఉదయం 7.40 గంటలకు నర్సాపురంనకు చేరుకుంటుంది. ఇక రేణిగుంట - నంద్యాల (07284) వరకు డెమో రైలు రేణిగుంటలో మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి నంద్యాలకు రాత్రి 8 గంటలకు చేరుకుంటుంది. అలాగే నంద్యాల - రేణిగుంట (07285) డెమో రైలు నంద్యాలలో ఉదయం 5.40 గంటలకు బయలుదేరి బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, ఉప్పలవాడు, జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కమలాపురం, కడపకు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, కోడూరు, బాలేపల్లె మీదుగా రేణిగుంటకు మధ్యాహ్నం 12.40 గంటలకు వస్తుంది. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నంద్యాల నుంచి కడప వరకు వెళ్లే డెమో రైలు రేణిగుంట వరకు పొడిగించడంతో తిరుమల వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు.