విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ప్రయాణికులతోపాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. రూఫ్‌టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరింపులకు దిగాడు. అతడిని జాగ్రత్తగా కిందికి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తొలుత విద్యుత్ సరఫరా నిలిపి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా.. నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుపైకి దూకాడు. దీంతో అతడి వెంటే పోలీసులు పరుగులు పెట్టారు.. ఎట్టకేలకు ప్రయాణికుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా కిందకు దింపి రైల్వే స్టేషన్ నుంచి ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రయాణికులు, పోలీసులు కొద్దిసేపు కంగారుపడ్డారు.. ఆ తర్వాత అతడ్ని కిందకు దించి ఆస్పత్రికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అతడు తప్పించుకోగలిగాడు. అదే వైర్లు పట్టుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అంటున్నారు.