దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 4 నగరాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. అంతేకాదు.. ఇండోర్ నగరం నంబర్ 1గా నిలవడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఈసారి ఇండోర్‌తో పాటు గుజరాత్‌కు చెందిన సూరత్ నగరం మొదటి స్థానాన్ని పంచుకుంది. 2023 సంవత్సరానికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ఢిల్లీలో గురువారం (జనవరి 11) జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో నవీ ముంబయి మూడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం (4), విజయవాడ (6), తిరుపతి (8) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ 9వ స్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని పుణే 10వ స్థానంలో ఉంది. భోపాల్ 5వ స్థానంలో నిలిచింది. ఇక పరిశుభ్రతలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పారిశుధ్య కార్మికుల విషయంలో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తున్న నగరంగా చంఢీగడ్ ప్రశంసలు అందుకుంది. గంగా నది తీరంలోని వారణాసి నగరం సైతం పరిశుభ్రత విషయంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. కేంద్రంలోని మోదీ సర్కార్ 2016లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ఇస్తున్నారు. 2023 సంవత్సరానికి 4,416 పట్టణ స్థానిక సంస్థలు, 61 కంటోన్మెంట్లు, 88 నగరాలు ఈ అవార్డులకు పోటీ పడ్డాయి. ఎంపిక ప్రక్రియలో భాగంగా.. ఆన్‌లైన్ ద్వారా 1.58 కోట్ల మంది ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించడం ద్వారా మరో 19.82 లక్షల మంది అభిప్రాయాలు తీసుకునన్నారు. వీటి ఆధారంగా ఈ అవార్డులకు అర్హత గత నగరాలను ఎంపిక చేశారు.