ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య రామ మందిరం దైవ సంకల్పం.. దేవకాళీ ప్రాణ ప్రతిష్ట తర్వాతే ప్రశాంతత: గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్

national |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 08:51 PM

అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు దేశం సిద్ధమవుతున్న వేళ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల సాకారం కాబోతోంది అంటున్నారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్. అద్భుతమైన కళాకౌశలంతో నిర్మించబడుతున్న ఈ ఆలయం కోట్లాది భారతీయుల స్వచ్ఛమైన భక్తికి తార్కాణంగా మాత్రమే కాకుండా.. మన దేశ సాంస్కృతిక వైభవాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రధానమంత్రి చేస్తున్న అవిశ్రాంత కృషికి గుర్తింపుగా కూడా నిలుస్తోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమౌతున్న వేళ.. దీనికి దారితీసిన సంఘటనల సమాహారం తన మదిలో మెదులుతోందన్నారు. రామమందిర నిర్మాణానికి సంబంధించి.. గతంలో జరిగిన అంశాలు, అనుభవాలను పంచుకున్నారు.


2002 వేసవిలో, అప్పటి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తమ బెంగళూరు ఆశ్రమానికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి.. కంచి శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతికి ప్రముఖ ముస్లిం నాయకులకు మధ్య జరిగిన చర్చలు విఫలమైన తరుణంలో.. కాంచీపురంలో శంకరాచార్యులను కలిసిన అనంతరం తమ సమావేశం జరిగిందన్నారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నిర్ణయాత్మకంగా వ్యవహరించి.. రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయాలనేదే ఆ సమయానికి ఏకైక లక్ష్యమన్నారు. అయితే కొన్ని డిమాండ్లు అప్పటి సంకీర్ణ ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్న వాజ్‌పేయికి ఆచరణ సాధ్యం కానివిగా ఉన్నాయన్నారు.


అయోధ్యలో ఏర్పాట్లు


ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొని తాను భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 2001లో వాజపేయిని కలుసున్నప్పటి నుంచీ తామిద్దరమూ అయోధ్య సమస్యపై సంప్రదించుకుంటూ ఉన్నామని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దీర్ఘకాలంగా ఉన్న ఈ వివాదాన్ని శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించుకునే పనిని ఆయన తనకు అప్పగించారని.. అందుకోసం ముస్లిం నాయకులు, ప్రముఖులతో వరుస చర్చలను ప్రారంభించానన్నారు. ఈ చర్చలు, వాటిలోని సూక్ష్మబేధాలు అదంతా వేరే కథ అంటూ వివరించారు. ముఖ్యంగా అయోధ్య విషయమై తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను వాజ్‌పేయి బలవంతంగా విరమింపజేసినప్పటినుండీ అశోక్ జీకి, ప్రధానికి మధ్య మాటల్లేవన్నారు. కాబట్టి ఇప్పుడు, రామజన్మభూమి సమస్యను వెంటనే పరిష్కరించేలా చట్టాన్ని ప్రవేశపెట్టడానికి వాజ్‌పేయిజీని ఒప్పించమని తనను అడిగేందుకు ఆయన ఆశ్రమానికి వచ్చారని వివరించారు. “ఈ ప్రయత్నంలో ప్రభుత్వం పడిపోయినా సరే నేను పట్టించుకోను.” అని తనతో అన్నట్లు చెప్పుకొచ్చారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్.


అప్పటికి అశోక్‌జీ వయసు 76 సంవత్సరాలని.. తన వయసుకు ఒకటిన్నర రెట్లు అన్నారు. వారి కళ్లలో చురుకుదనం, స్ఫూర్తివంతమైన మెరుపు, ధర్మబద్ధమైన లక్ష్యం, అదే సమయంలో ఆందోళన అన్నీ కనిపించాయి. ఏనాటికైనా ఈ మందిరం కట్టబడుతుందా? అని తనను ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. తన జీవితకాలంలో దానిని చూడగలనా? ఆ క్షణంలో తనకెందుకో.. ఇది కనీసం మరో 14 ఏళ్ల వరకు జరగదని అనిపించిందన్నారు. "ప్రార్థన చేయండి. మీ నిబద్ధతతో, అన్నీ సాధ్యమే." అని తాను ఆయనతో చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందన్నారు. అర్థమనస్కంగానే అశోక్ జీ అక్కడి నుంచి నిష్క్రమించారన్నారు.


అయోధ్యలో రామమందిరం ఏర్పాట్లు


మరునాటి ఉదయం తాను ధ్యానం చేస్తుండగా ఒక శిథిలావస్థలో ఉన్న దేవీ ఆలయం, కోనేరు తనకు కనిపించాయన్నారు. వాటిని పునరుద్ధరించవలసిన అవసరం ఉందని అనిపించినా.. ఆ సమయంలో తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు. కొన్ని రోజుల అనంతరం తమిళనాడు నుంచి తమ ఆశ్రమానికి వచ్చిన ఒక వృద్ధుడైన నాడీ సిద్ధాంతి తనను కలిసినట్లు చెప్పారు. వారు పురాతన తాళపత్రాలను చదువుతూ, ఒకవిధమైన సాధికార స్వరంతో, "గురుదేవ్, రామజన్మభూమి సమస్య పరిష్కారంకోసం ఇరు వర్గాలనూ ఒప్పించడంలో మీరు పాత్ర పోషించవలసి ఉంటుందని (తాళపత్రాలలో) వ్రాయబడింది” అని అన్నారని చెప్పుకొచ్చారు. "అంతే కాదు. శ్రీరాముని కులదైవమైన దేవకాళి ఆలయం అక్కడ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కూడా ఈ పత్రాలు చెబుతున్నాయి. దానిని పునరుద్ధరించనంతవరకూ అయోధ్య రామమందిరం చుట్టూ అల్లుకున్న హింస, కలహాలు ఆగవు.” అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. ఈ పని అతి త్వరగా జరగాలనే ఆత్రుత, నమ్మకం వారి మాటల్లో కనిపించాయి. “ఇది జరిగి తీరాల్సిందే!” తనతో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు రవిశంకర్.


చిత్రమేమంటే, అలాంటి దేవాలయం ఒకటి అక్కడ ఉన్నదనే విషయం అప్పటివరకూ తనకు కానీ.. ఆ నాడీ సిద్ధునికి కానీ తెలియనే తెలియదన్నారు. అప్పుడిక అయోధ్యలో కాళీమందిరాలు ఎక్కడ ఉన్నాయో విచారణ చేశామని.. అక్కడ రెండు కాళీమందిరాలు ఉన్నాయని త్వరగానే తెలిసిందన్నారు. ఒకటి ఛోటీ దేవకాళీ మందిర్ అయోధ్య నడిబొడ్డున ఉండగా.. రెండవ మందిరం దేవకాళీ మందిర్ అక్కడకు కొంచెం దూరంలో ఉందన్నారు. దేవకాళీ మందిరం శిథిలావస్థలో ఉందని.. కోనేరు చెత్తతో నిండిపోయి ఉందన్నారు. ఢిల్లీ, లక్నోలో ఉన్న తమ కార్యకర్తలను సంప్రదించి ఈ దేవాలయాన్ని, కోనేటిని పునరుద్ధరించవలసిందిగా సూచించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సెప్టెంబరు రెండోవారానికల్లా వారు ఆ పని విజయవంతంగా పూర్తిచేశారన్నారు.


అయోధ్యలో రామ మందిరం


ఆ తర్వాత సెప్టెంబరు 18న కొంత మందితో కలిసి అయోధ్య వెళ్లానని.. హనుమాన్ గఢీ, శ్రీరామ జన్మస్థానం, ఇతర పవిత్ర స్థలాలను దర్శించేందుకు వెళ్ళామన్నారు. పట్టణంలోని ఇరుకైన, చెత్తతో నిండిన మార్గాలు అక్కడి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయని.. ప్రజల్లో భయాందోళనలు నెలకొని ఉన్నాయన్నారు. తాను వెళ్లిన ప్రతిచోటా, ఈ దీర్ఘకాల సంఘర్షణలో జీవితాలను కోల్పోయిన ఎందరో సాధువులు, సన్యాసులు విషాదగాధలను అక్కడి ప్రజలు వినిపించారన్నారు. వారెవరీకీ అక్కడ ఘనమైన ఆశ్రమాలు లేవు, కుటుంబాలు, శిష్యబృందాలు లేవు. నిలువనీడ కూడా లేదన్నారు. వారి తరపున ఎవరూ మాట్లాడే ధైర్యం చేయరని.. వారి గాధలకు ఏ పత్రికలలోనూ, ప్రచారసాధనాలలోనూ ఎప్పుడూ చోటు దొరకదన్నారు. వారి బాధల గాథలు వింటుంటే గుండె తరుక్కుపోయిందన్నారు.


ఆరోజు, 2002 సెప్టెంబరు 19వ తేదీ ఉదయం దేవకాళీ ఆలయ పునఃప్రతిష్ఠ జరిగిందని.. తమ ఆశ్రమం నుంచి వచ్చిన వేదపండితుల బృందం తన సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. తాను యజ్ఞకుండంలో పూర్ణాహుతి అర్పించినప్పుడు.. ఈ ఆలయ వృద్ధ పూజారి కళ్లలో కృతజ్ఞతతో కూడిన ఆనందబాష్పాలను గమనించానన్నారు. దేవకాళి తన పూర్వ వైభవంతో అపూర్వంగా ప్రకాశిస్తోందన్నారు. అంతకు ముందు తనకు ధ్యానంలో కలిగిన కాళీ మందిర పునరుద్ధరణ ఆలోచనను.. దానిని అప్పుడు పట్టించుకోని విషయాన్ని, అనంతరం నాడీ సిద్ధాంతి చెప్పిన విషయాన్ని ఈ కార్యక్రమానికి హాజరైన డా. బి.కె. మోదీతో పంచుకున్నానన్నారు. మరొక చిత్రం.. దేవకాళీ ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్యలో ఏవిధమైన రక్తపాతం, మతకలహాలు, కొట్లాటలు జరగలేదన్నారు. ఆ విధంగా గ్రంథాలలో చెప్పబడిన వాక్కు ధృవమైందన్నారు. అశోక్ సింఘాల్ కూడా ఆరోజు కార్యక్రమంలో పాల్గొన్నారని.. అప్పటికి కూడా తనకు అయోధ్య వివాదం పరిష్కారానికి మరో 14 ఏళ్ల పడుతుందనే అనిపించిందన్నారు.


ఆనాటి సాయంత్రం, దేవకాళీ ఆలయ ప్రాంగణంలో జరిగిన సంత్ సమాగమానికి హిందూ, సూఫీ సాధువులను ఆహ్వానించామన్నారు. ఆ సత్సంగంలో వెయ్యిమందికి పైగా పాల్గొన్నారని.. వివాదం శాంతియుతంగా పరిష్కరించబడాలని అందరూ కలిసి ప్రార్థించారన్నారు. తాను ముస్లిం నాయకులను సత్కరించినపుడు.. వారు తనకు తులసి రామాయణాన్ని, దానితో పాటు ఖురాన్ కాపీని అందించారన్నారు. శ్రీరాముని పట్ల తమకున్న ప్రగాఢ భక్తిని గురించి ముచ్చటించారని తెలిపారు. అపూర్వమైన సోదరభావం వారిలో వ్యక్తమైందని.. సమాజం విడిపోవాలనుకునేవారు, వారి స్వార్థప్రయోజనాల కోసమే అలా చేస్తారనే తన నమ్మకాన్ని ఇది బలపరిచిందన్నారు.


ఎంతో కాలంగా సాగుతున్న ఈ సంఘర్షణలో ఇప్పటికే చాలా రక్తపాతం జరిగిందన్నారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్. ఇప్పడిక కాలపరీక్షకు తట్టుకుని నిలబడగలిగే సరైన నిర్ణయం తీసుకోవడం అవసరమని.. దీన్ని దృష్టిలో ఉంచుకునే, కోర్టుకు వెలుపల పరిష్కారం జరిగేలా, రామజన్మభూమిని ముస్లిం సమాజమే హిందువులకు బహుమతిగా ఇవ్వాలని, దానికి ప్రతిగా హిందువులు వారికి 5 ఎకరాల భూమిని బహుమతిగా ఇవ్వాలని తాను సం.2003 లో ప్రతిపాదించానన్నారు. ఆ 5 ఎకరాల్లో మసీదు నిర్మాణం కోసం వారు సహాయం చేస్తారని.. ఇది రెండు వర్గాల మధ్య సోదరభావం ఉన్నదనే స్పష్టమైన సందేశాన్ని రాబోయే తరాలకు అందిస్తుందన్నారు.


దేవకాళీ ప్రాణ ప్రతిష్ట తర్వాత, అశోక్ జీ తనను అలహాబాద్‌లోని తమ పూర్వీకుల ఇంటికి ఆహ్వానించారన్నారు. అక్కడ చేరిన వారితో ధ్యానం చేయించామమని.. అనంతరం “ఏ సంకల్పమైనా సఫలం కావడానికి మానవ ప్రయత్నంతో బాటు, దైవిక సంకల్పం కూడా తనవంతు పాత్ర పోషిస్తుంది. దాని కోసం, మనం ఓపికగా వేచి ఉండాలి.” అని అశోక్‌జీతో తాను చెప్పానన్నారు. హడావుడి కూడదని, తొందరపడి ఏపనీ చేయవద్దని తాను వారికి సూచించానని.. ఆ సాయంత్రం గడిచేటప్పటికి వారు మరింత విశ్రాంతిగా, ధైర్యం వచ్చినట్లు కనిపించారన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వంపట్ల వ్యతిరేక వైఖరి తగ్గి, కాస్త మెత్తబడ్డారన్నారు. సంవత్సరాలు గడిచాయి.. 2017లో, ఇరు వర్గాల నాయకుల భావనలు, వాటికి తోడు సర్వోన్నత న్యాయస్థానం సూచనలతో రామజన్మభూమి విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తన ప్రయత్నాలను మళ్లీ ప్రారంభించానన్నారు.


అంతిమంగా, రామమందిర నిర్మాణానికి ఆ భూమిని కేటాయిస్తూ, మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాలను కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయాన్ని గుర్తు చేశారు. 500 ఏళ్ల వివాదం శాంతియుతంగా పరిష్కారించబడిన ముఖ్యమైన సందర్భం అది.. సింఘాల్ జీ సంకల్పదీక్ష, మోదీజీ దార్శనికత, లక్షలాది భారతీయుల చిత్తశుద్ధితో కూడిన ప్రార్థనలు, దైవాశీస్సులు అన్నీ కలిసి ఈనాటి చారిత్రాత్మక క్షణానికి దారితీశాయన్నారు. చాలాసార్లు, స్థూలంగా మనకు కనిపించే విషయాలకు ఆధారభూతంగా సూక్ష్మమైన అంశాలు ఉంటాయన్నారు. భౌతింగా వ్యక్తమవ్వడానికి ముందుగానే ఆ సంఘటనలు సూక్ష్మస్థాయిలో జరుగుతాయన్నారు. 'మనమేమో ఈ పని ఇలా జరగడానికి ఫలానాది కారణమని (కార్య-కారణ సిద్ధాంతాన్ని) చర్చిస్తూ, స్థూల ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాము. ఎప్పుడో తప్ప, అంతకు మించి ఆలోచించము. అలా ఆలోచించినప్పుడు, సూక్ష్మస్థాయిలో పనిచేసే శక్తులు స్థూలంగా జరిగే కార్యాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మనం గ్రహించి ఉండేవాళ్లమే. మన జీవితంలోని అనేక విచిత్రాలలో ఇది మరొక చిత్రమైన రహస్యం'అన్నారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com