ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీని సీఎంగా నెరవేర్చాలంటూ నెల రోజులకుపైగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు వేడుకుంటున్నారు. వారిని అత్యవసర సేవల చట్టం (ఎస్మా) పరిధిలోకి తీసుకువచ్చారు. జనవరి 5లోగా విధుల్లో చేరకుంటే తొలగిస్తామంటూ హెచ్చరించారు. ఎస్మా చట్టంలో భాగంగా అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులను అందించారు. నోటీసులను చేతికి తీసుకోకుంటే వారి ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు అతికించేశారు. పోస్టుల్లోనూ కొందరికి పంపించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 1248 మంది అంగన్వాడీ కార్యకర్తలకు, 725 మంది ఆయాలకు షోకాజ్ నోటీసులను అందించినట్లు ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. ఈనెల 9వ తేదీతో జారీ అయిన నోటీసుల్లో పది రోజుల్లో వివరణ ఇవ్వకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంటే 19వ తేదీని గడువుగా నిర్ణయించారు. అప్పటిలోగా విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెబుతున్నారు.